గాడితప్పిన విద్యా వ్యవస్థ
–విద్యా సంవత్సం ముగుస్తున్నా పిల్లలకు అందని యూనిఫాం
– కంప్యూటర్‌లున్నా బోధించేవారు లేరు
– పిల్లలున్న చోట టీచర్లు లేరు
– టీచర్లు ఉన్న చోట పిల్లలు లేరు
కదిరి : సర్కారు బడి అనగానే అక్కడ పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులు ఉంటారన్నది అక్షర సత్యం. అలాంటి పిల్లలు చదివే చోట మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా జిల్లా విద్యా వ్యవస్థ నడుస్తోంది. విద్యాసంవత్సం ముగింపు దశకు వస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫాం అందజేయలేదు. 100 మంది పిల్లలున్న చోట ఇద్దరు, 20 మంది ఉన్న చోట నలుగురు ఉపాధ్యాయులున్నారు.
ఈ పరిస్థితి జిల్లాలో చాలా చోట్ల ఉంది. సాంకేతిక విద్య పేరుతో అన్ని పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేసినా... బోధించేందుకు ఫ్యాకల్టీలు లేరు. జిల్లాలో 3,164 ప్రాథమిక, 957 ప్రాథమికోన్నత, 676 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటన్నింటిలో 14,402 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. ఏ పాఠశాలను పరిశీలించినా ఏమున్నది గర్వకారణం అన్న చందంగా సమస్యలు తిష్ట వేశాయి. విద్యార్థులకే కాదు ఉపాధ్యాయులకూ ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.
సమస్యలు ఇలా..
ూ ఈ విద్యాసంవత్సరం మార్చితో ముగియనుంది. కానీ ఇప్పటి దాకా పిల్లలకు యూనిఫాం సరఫరా చేయలేదు. దీంతో చిరిగిన దుస్తులతోనే హాజరవుతున్నారు.
- జిల్లా వ్యాప్తంగా 80 శాతం పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. కొన్ని పాఠశాలల్లో ఉన్నా.. నీటి సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో పిల్లలే కాకుండా మహిళా టీచర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు.
-చాలా పాఠశాలలకు అటెండర్లు లేరు. స్వీపర్లు అసలే లేరు. ఈ రెండు పనులూ విద్యార్థులతోనే కానిచ్చేస్తూ పాఠశాల స్థాయిలోనే బాలకార్మికులుగా మార్చేస్తున్నారు.
-ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌లు ఉన్నప్పటికీ వాటిని పిల్లలకు తెలియజెప్పేందుకు బోధకులు లేరు. వాటి రక్షణకు నైట్ వాచ్‌మ్యాన్‌లు కూడా లేరు.
-చాలా పాఠశాలల్లో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉంది. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న చోట విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వ విద్యావ్యవస్థ కుంటుపడుతోంది.
- జిల్లా వ్యాప్తంగా చాలా మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేరు. దీంతో ఆయా మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడే ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన రెండింటికీ న్యాయం చేయలేక పోతున్నారు.
- ఉపాధ్యాయులకు విద్యాసంవత్సం మధ్యలో టీఏఆర్‌సీ, ఆర్‌ఎంఎస్‌ఏ లాంటి శిక్షణా తరగతులు నిర్వహించడం వలన సింగిల్ టీచర్ ఉన్న చోట బడులు మూతబడుతున్నాయి. దీంతో రెగ్యులర్ సిలబస్ పూర్తి చేయలేక పోతున్నారు.
- ఉపాధ్యాయులకు న్యాయబద్దంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన రెండు డీఏలు, పది నెలల అరియర్స్, సర్వీస్ రూల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. హెల్త్ కార్డులున్నా వాటితో టీచర్లకు నగదు రహిత వైద్యం అందడం లేదు.