విద్యావలంటీర్ల నియామకానికి పచ్చజెండా | education volunteers posts green signal | Sakshi
Sakshi News home page

విద్యావలంటీర్ల నియామకానికి పచ్చజెండా

Published Sat, Jul 2 2016 8:57 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

విద్యావలంటీర్ల నియామకానికి పచ్చజెండా - Sakshi

విద్యావలంటీర్ల నియామకానికి పచ్చజెండా

ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
ఈనెల 12లోపు నియామకాలు పూర్తి
ఇంకా 253 అవసరం..

నిజామాబాద్ అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత అధిగమించేందుకు ప్రభుత్వం విద్యావలంటీర్ల నియామకానికి పచ్చజెండా ఊపింది. టీచర్ల కొరత ఉన్నచోట్ల విద్యావలంటీర్లను నియమించాలని   పాఠశాల విద్యాశాఖ శుక్రవారం జీవో నంబర్ 97ను విడుదల చేసింది. ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులకు గురువారం రాత్రి ఆదేశాలు అందాయి. జిల్లాలో 21,175 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక 1,576, ప్రాథమికోన్నత 263, ఉన్నత పాఠశాలలు 463 ఉన్నాయి. 10 వేల మంది టీచర్లు, 2.50 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

జిల్లాలో 941 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా.. ఈ విద్యా సంవత్సరానికి 838 విద్యావలంటీర్లు అవసరం. ఈ ప్రతిపాదనలు పాఠశాల డెరైక్టర్‌కు పంపగా 585 విద్యావలంటీర్ల పోస్టులు మంజూరు చేశారు. ఇంకా 253 మంది అవసరం. ఈనెల 12వ తేదీలోపు నియమకాలు పూర్తి చేసి.. 16వ తేదీన పాఠశాలల్లో విద్యాబోధన చేపట్టేందుకు ప్రక్రియను విడుదల చేశారు. టీచర్ పోస్టు ఖాళీలు ఎక్కువగా ఉన్న బిచ్కుంద, మద్నూరు, జుక్కల్, మాచారెడ్డి, దోమకొండ, లింగంపేట, ఎల్లారెడ్డి ప్రాంతాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ విద్యావలంటీర్ల నియామకం చేపట్టనున్నారు.

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నియూమకాలు
విద్యావలంటీర్ల ఎంపికను జిల్లా విద్యాశాఖ పూర్తి చేస్తుంది. అనంతరం మండల విద్యాశాఖ అధికారులకు ఎంపిక జాబితా అందించి నియమకాలు చేయనున్నారు. విద్యావలంటీర్‌కు రూ.8వేల వేతనం నిర్ణయించారు. రొస్టర్, రిజర్వేషన్, వెయిటేజీ మార్కులతో నియూమకాలు చేపట్టనున్నారు. టెట్ ఉత్తీర్ణులైన వారికి 20 శాతం, సంబంధిత సబ్జెక్టులో 10 శాతం, ఇంటర్ ఇంగ్లిష్ మీడియం చదివినట్లయితే 10 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. మొదట సంబంధిత గ్రామం లేదా పక్కన ఉన్న మరో గ్రామం లేదా మండలంలో పోస్టులు ఖాళీగా ఉంటే నియమకాలు చేపడుతారు. గతంలో పాఠశాల విద్యాశాఖనే ఈ నియామకాలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ నియూమకాలు చేపట్టాలని  ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తేదీని ఖాళీలు గుర్తించిన తరువాత ప్రకటిస్తామని జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. కానీ.. ఈనెల 16వ తేదీలోపు నియూమకం పొందిన విద్యావలంటీర్లు పాఠశాలలో విద్యాబోధన చేసే విధంగా ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి.

ఇంగ్లిష్ మీడియంకు మొండిచేయి
ఇంగ్లిష్ మీడియం విద్యకు సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యావలంటీర్ల నియూమకం మొదటి ఏడాదిపాటు స్థానిక పాఠశాల, గ్రామస్తులే విద్యావలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం మంజూరు చేసిన పోస్టులు ఇంగ్లిష్ మీడియంకు వినియోగించడానికి వీలు లేదు. ఈ ఏడాది జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఇంగ్లిష్ మీడియం విద్యకు ప్రవేశాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా నేటి వరకు 450 పాఠశాలల్లో 17 వేల మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం విద్యలో ప్రవేశాలు పొందారు. ఈ లెక్కన పాఠశాలకు 2, 3 విద్యాదలంటీర్లను నియమిస్తే 1,233 మంది అవసరం.

వీరికి స్థానిక గ్రామస్తులే ఏడాదిపాటు వేతనం ఇచ్చి బోధించేలా చేయూలి. ఇదీ ఎంత వరకు సాధ్యమవుతుందని జిల్లా విద్యాశాఖ ఆందోళన చెందుతుంది. ఇంగ్లిష్ మీడియం విద్యకు విద్యావలంటీర్ల కొరత ఉంది. ఒక్కో పాఠశాలలో 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉంటే కేవలం ఇద్దరు, ఒకరు టీచర్లు మాత్రమే విద్యాబోధన అందిస్తున్నారు. ఇలాంటి పాఠశాలల్లో విద్యాబోధనకు  ఇబ్బందికరంగా మారింది. ఇంగ్లిష్ మీడియం విద్యకు వలంటీర్లను మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. రెండు రోజుల కిందట ఆదేశాలు అందాయని, జిల్లాలో టీచర్ పోస్టులు గుర్తించి ఇబ్బంది అధికంగా ఉన్న చోట వాలంటీర్లను నియమిస్తామని డీఈవో లింగయ్య తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement