పంటల్లో తెగుళ్ల నివారణకు కృషి
నంద్యాలరూరల్: జిల్లాలో వివిధ పంటల్లో పురుగులు, తెగుళ్ల నివారణకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా కృషి చేయాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ బి.గోపాల్‌రెడ్డి కోరారు. శనివారం ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ట్రైనింగ్ అండ్ విజిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ మాట్లాడుతూ జిల్లాలో కంది, శనగ, పత్తి, వరి, జొన్న, మినుము, పొద్దుతిరుగుడు పంటల్లో తెగుళ్లు సోకాయని వివరించారు. రైతులను అప్రమత్తం చేసి సస్యరక్షణ చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. వర్షం లేనందున అక్కడక్కడ మినుము, పొగాకు, కంది, జొన్న పంటలు ఎండుదశకు చేరుకున్నాయని, చలిమంచు లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణమన్నారు. అందుబాటులో నీటి వసతి ఉంటే ఒక తడి పెట్టేందుకు ప్రోత్సహించాలని ఏడీఏలను కోరారు. జిల్లా వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరక్టర్ మల్లికార్జునరావు, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రామారెడ్డి, డాక్టర్ మోహన్‌విష్ణు, జిల్లాలోని వ్యవసాయ సహాయ సంచాలకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అనంతరం ఆర్‌ఏఆర్‌ఎస్‌లోని పత్తి పంటను డాక్టర్ రామారెడ్డి, వరిపంటను డాక్టర్ మోహన్‌విష్ణులు క్షేత్రస్థాయికి అధికారులను తీసుకెళ్లి సలహాలు, సూచనలు ఇచ్చారు.