- గయాళ్లు భూములపై పెద్దల కన్ను
- ఆక్వా సాగు ముసుగులో 200 ఎకరాల్లో పాగా
- లీజు పొందకుండానే చెట్ల నరికివేత
- బరితెగిస్తున్న అధికార పార్టీ పెద్దలు
సముద్ర తీరాన ఉప్పుటేరును ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను బ్రిటిష్‌వారి హయాంలో ‘గయాళ్లు’ అని పిలిచేవారు. ఈ భూములకు రెవెన్యూ విభాగంలో ఎటువంటి సర్వే నంబర్లూ ఉండవు. వీటిని రెవెన్యూ శాఖ పరిశీలించి, సర్వే నంబర్లు ఇచ్చి, నిరుపేదలకు వీటిని ఏడాదికి ఒక ఎకరం లీజుకు ఇస్తారు. దీనిని ‘ఏక్ సాల్ లీజు’ అని పిలుస్తారు. ఈ లీజు పేరుతో కొందరు అధికారుల వత్తాసుతో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు గలీజు వ్యవహారానికి పాల్పడుతున్నారు.
అల్లవరం (అమలాపురం) : ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందంటే చాలు.. అది మడ అడవైనా.. ఉప్పుటేరు భూములైనా సరే.. అందులో పాగా వేసేందుకు అధికార టీడీపీకి చెందిన కొందరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం నిబంధనలను సహితం ఖాతరు చేయకుండా బరితెగిస్తున్నారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం రెవెన్యూ పరిధిలో ఎస్.పల్లిపాలెం బ్రిడ్జిని ఆనుకుని ప్రభుత్వ గయాళ్లు భూమి 200 ఎకరాలు ఉంది. ఎస్.పల్లిపాలెం నుంచి నక్కా రామేశ్వరం, మిలిటరీ పర్ర భూముల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన మడ, తిల్ల, ఇతర వృక్షజాతులు ఈ భూముల్లో ఉన్నాయి. మామూలుగా ఈ భూములను రెవెన్యూ అధికారులు సర్వే చేసి, ఆయా గ్రామాల్లో నిరుపేదలను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి ఎకరం చొప్పున చేపలు, రొయ్యల చెరువుల ఏర్పాటు నిమిత్తం ఏడాది కాలానికి లీజుకు ఇస్తారు. ఏడాది తరువాత ఈ లీజును రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ ఆ లబ్ధిదారు లేకపోతే, తరువాత అర్హులైనవారికి ప్రాధాన్య క్రమంలో ఈ భూములను కేటాయిస్తారు.
చేతులు మారిన భూములు
ఏక్ సాల్ లీజు పట్టా భూముల్లో వందలాది ఎకరాలు నేడు చేతులు మారాయి. కొందరు ఆక్వా రైతులు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెబుతూ, ఏక్ సాల్ పట్టా భూములను కైంకర్యం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొందరు ‘పెద్దలు’ మిలటరీ పర్రభూములు, మడ అడవుల్లో పాగా వేసి వందలాది ఎకరాలను తమ చేతుల్లోకి తెచ్చుకుంటున్నారు. నక్కా రామేశ్వరం ప్రాంతంలోని సీతారామపురం, చుక్కాబద్ద (పర్రభూములు), వైనతేయ నదీ పరివాహక ప్రాంతంలో వందలాది ఎకరాలకు ఏక్ సాల్ లీజు పట్టాలున్నాయి. ఈ భూములన్నీ ప్రస్తుతం ‘పెద్దల’ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఎస్.పల్లిపాలెం వద్ద ఉప్పుటేరు చెంతనే ఉన్న గయాళ్లు భూములను ఏక్ సాల్ లీజు పేరుతో చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొమరగిరిపట్నం, ఎస్.పల్లిపాలెం గ్రామాలకు చెందిన సుమారు 250 మంది ఏక్ సాల్ లీజుకు ఆర్డీఓ గణేష్‌కుమార్‌కు రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఎస్.పల్లిపాలేనికి చెందిన 150 మంది, కొమరగిరిపట్నానికి చెందిన 100 మంది వీరిలో ఉన్నారు. వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్న ఆర్డీఓ ఉప్పుటేరు భూములను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా స్థానిక తహసీల్దార్ వడ్డి సత్యవతిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మడ, తిల్ల, ఆల్చీ వృక్షజాతులున్న గయాళ్లు భూములను తహసీల్దార్ పరిశీలించారు. మరోపక్క ఇదే అదనుగా దరఖాస్తు చేసుకున్న కొందరు సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న తిల్ల, ఆల్చీ వృక్షసంపదను పొక్లెయిన్‌తో కూకటి వేళ్లతో పెకలించేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులూ లేకుండానే భారీయంత్రాలతో చెరువుల ఏర్పాటుకు గట్లు వేసేశారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ముమ్మరంగా సర్వే
మరోపక్క ఏక్ సాల్ లీజు పట్టాకు దరఖాస్తు చేసుకున్న గయాళ్లు భూముల్లో లంకల సర్వేయర్ రవిశంకర్ నేతృత్వంలో కొద్ది రోజులుగా సర్వే జరుగుతోంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం సర్వే పరి«ధిలో లేని గయాళ్లు భూమిని తొలుత సర్వే చేసి, అనంతరం సర్వే నంబర్లు కేటాయిస్తారని తెలుస్తోంది. ఎన్ని ఎకరాల్లో గయాళ్లు భూములున్నాయో నిర్ధారించుకొన్న తరువాత కలెక్టర్‌కు నివేదిక పంపించనున్నారు.
ఏక్ సాల్ పట్టాలు పొందాలంటే..
ఏక్ సాల్ లీజు పొందాలంటే వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్ తొలుత పరిశీలించాలి. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి. దీనిపై ఆర్డీఓకు, కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలి. ఆర్డీఓ ఆ నివేదిక పరిశీలించాక కలెక్టర్‌కు పంపిస్తారు. తహసీల్దార్, ఆర్డీఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏక్ సాల్ పట్టాలపై కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుని ఏక్ సాల్ లీజు పట్టాలు మంజూరు చేస్తారు. కానీ ప్రస్తుత వ్యవహారంలో తహసీల్దార్ పరిశీలించినదే తడవుగా గయాళ్లు భూముల్లో ఉన్న వృక్షసంపదను దరఖాస్తుదారులు నరికేసి, దారులు ఏర్పాటు చేసేశారు. గుట్టుచప్పుడు కాకుండా ఆక్వా చెరువులుగా మార్చేందుకు సన్నాహాలు చేసేశారు. అంటే సర్వే పూర్తి కాకుండానే.. తహసీల్దార్, ఆర్డీఓలు నివేదికలు ఇవ్వకుండానే.. కలెక్టర్ పట్టాలు మంజూరు చేయకుండానే.. ఇష్టారాజ్యంగా భూముల్లో చెట్లు నరికేస్తున్నారన్నమాట. దీనిపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా, ‘ఏక్ సాల్ లీజు పట్టాలివ్వాలంటే చెట్లను తొలగించాలి కదా!’ అని చెబుతున్నారు.
ఉపేక్షించం
కొమరగిరిపట్నంలో ఎస్.పల్లిపాలేనికి ఆనుకుని ఉన్న గయాళ్లు భూములకు ఏక్ సాల్ లీజు కోసం రెండు గ్రామాలకు చెందిన 250 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రా«థమిక పరిశీలనలో భాగంగా ఆర్డీఓ గణేష్‌కుమార్ ఆదేశాల మేరకు గయాళ్లు భూములను పరిశీలించాం. సర్వే పరిధిలో లేని ప్రభుత్వ భూములు కావడంతో ఎవ్వరికీ ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదు. ఈ భూముల్లో ఎటువంటి అన్యాక్రాంత చర్యలకు పాల్పడినా ఉపేక్షించం.
- వడ్డి సత్యవతి, తహసీల్దార్, అల్లవరం