అయ్యో.. పాపం!
ఫీవర్ ఆస్పత్రిలో వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
కళ్లు కనిపించని ళవృద్ధురాలిని ఫీవర్ ఆవరణలో
వదిలి వెళ్లిన కఠినాత్ములు
నల్లకుంట : గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలి(80)ని ఆటోలో తీసుకు వచ్చి ఫీవర్ ఆస్పత్రి ఆవరణలో వదిలేసి వెళ్లారు. అందరూ ఉండి అనాథగా మిగిలిన కళ్లు కనిపించని ఆ అవ్వ తాను ఎక్కడ ఉన్నది కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంది. పైగా తాను కొడుకు ఇంట్లోనే ఉన్నానని అనుకుంటోంది. శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలిని ఆటోలో తీసుకు వచ్చి నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు.
ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఆ వృద్ధురాలికి కళ్లు కనిపించవు. దీంతో రాత్రి 8 గంటల వరకు అలాగే ఆస్పత్రి ఎమర్జెన్సీ ఓపీ వద్ద కూర్చుండిపోయింది. అది గమనించి సాక్షి ప్రతినిధి వృద్ధురాలి వద్దకు వెళ్లి పలకరించగా తాను అందరూ ఉన్న అనాథ అని వాపోయింది. తన పేరు లక్ష్మమ్మ(80) అని, నల్లగొండ జిల్లా వలిగొండ మండలం వెలువర్తి స్వగ్రామమని వివరించింది. తనకు ఇద్దరు కొడుకులని పెద్ద కొడుకు యాదయ్య, కోడలు సుగుణమ్మలు హైదరాబాద్ గాంధీనగర్‌లో ఉంటారని చెప్పింది. తాను కొడుకు యాదయ్య ఇంట్లోనే ఉన్నానని తెలిపింది.
అంతా విన్న ఆస్పత్రి సిబ్బంది అవ్వా‘ నీవు నీ కొడుకు ఇంట్లో లేవు.. కోరంటి దవాఖానలో ఉన్నావు’ అని చెప్పినా ఆ వృద్ధురాలు నమ్మడంలేదు. ‘నేను నా కొడుకు ఇంట్లేనే ఉన్నాను’ అని చెప్పడంతో అందరి హృదయాలు చలించిపోయాయి. ఎవరో కఠినాత్ములైన కొడుకులు కళ్లు కనిపించని తల్లిని ఇలా ఆస్పత్రి ఆవరణలో వదిలేసి వెళ్లారని ఆస్పత్రికి వచ్చిన రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.