తెలంగాణ అభివృద్ధి కోసమే ఎన్నిక
♦ అభివృద్ధి కాముకులు- నిరోధకులకు మధ్య పోటీ
♦ సభ్యత్వంలేని వారికి బీజేపీ టికెట్
♦ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
హన్మకొండ: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో తెలంగాణ పునర్నిర్మాణ అభివృద్ధి కాముకులు, అభివృద్ధి నిరోధకులు, అడ్డంకులు సృష్టిస్తున్న వారికి మధ్య పోటీ జరుగుతోందని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. హన్మకొండలోని కుడా మైదానంలో బుధవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన ఉప ఎన్నికలకు, ఈ ఎన్నికకు తేడా ఉందన్నారు. అప్పుడు తెలంగాణ ఆకాంక్షను చాటి చెప్పడానికి ఎన్నికలు జరిగితే.. నేడు తెలంగాణ అభివృద్ధి కోసం జరుగుతున్నాయని చెప్పారు. విపక్షాలకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు.
కనీసం సభ్యత్వం కూడా లేని వారికి బీజేపీ టికెట్ ఇచ్చిందన్నారు. తెలంగాణలో పోటీకి టీడీపీ భయపడుతోందని.. మెదక్, శాసన మండలి, వరంగల్ లోక్‌సభకు జరుగుతున్న ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ పోటీ చేయడం లేదంటే అది ఆంధ్రోళ్ల పార్టీ అని అర్థమైందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పార్టీలోని సామాన్య కార్యకర్త పసునూరి దయాకర్‌కు టికెట్ ఇవ్వడంతో పాటు ఎన్నికల ఖర్చు రూ.70 లక్షలు ఇచ్చారన్నారు.
ఆర్థిక, పౌరసరఫరాల శాఖమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ పాలనలో రాత్రిపూట కరెంటు ఇవ్వడంతో మోటా ర్లు పెట్టుకునేందుకు వెళ్లిన రైతులను నక్సలైట్లుగా భావించి పోలీసులు చంపిన ఘటనలు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయూనికి పగటిపూటే కరెంట్ ఇచ్చేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ తదితరులు పాల్గొన్నారు.