టీడీపీ-బీజేపీ కటీఫ్!
♦ అసెంబ్లీ సమావేశాల్లో బయటపడ్డ వైరుధ్యాలు
♦ ‘చేతికి’ దగ్గరవుతున్న సైకిల్!
♦ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ స్నేహానికి తెరపడినట్లేనా? ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ విషయం నిజమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘ఓటుకు కోట్లు’ కేసులో టీటీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలు సహా ఆ పార్టీ నాయకత్వం ఇరుక్కున్నప్పటి నుంచి బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందని... వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక నాటికి అది తీవ్ర రూపం దాల్చిందని చెబుతున్నాయి. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం, అధికార టీఆర్‌ఎస్‌లోకి పార్టీ ఎమ్మెల్యేల వలసలతో డీలాపడ్డ టీటీడీపీ...ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు రాష్ట్రంలో పెద్దగా ప్రజాదరణలేని బీజేపీతోకన్నా కాంగ్రెస్‌తో దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందని ఆ వర్గాలు వివరించాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కూడా పార్టీ నేతలకు ఇదే డెరైక్షన్ ఇచ్చారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
వరంగల్ ఉప ఎన్నిక నుంచి...
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థ్ధి పోటీ చేసి డిపాజిట్ కోల్పోవడంతో టీటీడీపీ నాయకులు తమకు సహకరించలేదని బీజేపీ కూడా ఆరోపించింది. నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీజేపీ పెద్దగా సహకరించలేదని టీడీపీ పేర్కొంది. దీంతో ఆ వెంటనే జరిగిన గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీటీడీపీ, బీజేపీలు వేర్వేరుగానే పోటీ చేశాయి. దీంతో వీరి మైత్రి బంధానికి తెరపడిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీని కితోడు ఆపరేషన్ ఆకర్ష్ వల్ల 15 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ సంఖ్య మూడుకు పడిపోయింది. ఒక విధంగా తెలంగాణలో ఆ పార్టీ ఉనికి పూర్తిగా ప్రమాదంలో పడింది. తిరిగి పార్టీని పట్టాలు ఎక్కించేందుకు ఒంటరిగా ప్రయాణం చేస్తే కష్టమని, కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన బీజేపీ వల్ల కూడా పెద్దగా ఉపయోగం ఉండదని టీటీడీపీలో చర్చ జరి గిందని సమాచారం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో కలసి నడవడమే ఉత్తమమన్న భావనతో టీడీపీ కాంగ్రెస్‌కు దగ్గరవుతోందని విశ్లేషిస్తున్నారు.
బడ్జెట్ సమావేశాల్లోనూ వేర్వేరు దారులే
బడ్జెట్ సమావేశాల్లోనూ టీడీపీ, బీజేపీలు వేర్వేరుగానే వ్యవహరించాయి. ఏ ఒక్క అంశంలోనూ ఉమ్మడి వ్యూహంతో ఇరు పార్టీలు కలసి పనిచేయలేకపోయా యి. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు టీటీడీపీ గైర్హాజరవగా బీజేపీ హాజరై చర్చ లో పాల్గొంది. బాబు ఆదేశాల మేరకే కాం గ్రెస్ బాటలో టీడీపీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు హాజరు కాలేదన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీలు ఒకే అభిప్రాయం వ్యక్తం చేయడం.. దానిపై అభ్యంతరాలు తెలుపుతూ అసెంబ్లీ స్పీకర్‌కు ఒకే తరహా లేఖలు ఇవ్వడం... ప్రజెంటేషన్ సందర్భం గా కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యే లు టీడీఎల్పీ ఆఫీసులోనే సీఎం ప్రజెంటేషన్‌ను వీక్షించడం వంటి పరిణామాలు ఇందులో భాగమేనని అంటున్నారు.