
గాలొస్తే గండమే..!
► గాలిదుమ్ముకు కూలిపోతున్న విద్యుత్ స్తంభాలు
► గుంతలు తీసి పాతే సమయంలో పట్టింపు కరువు
► స్తంభాల నాణ్యతపై పలు అనుమానాలు
► ఆందోళన చెందుతున్న వినియోగదారులు
మన్నికగా ఉండాల్సిన విద్యుత్ స్తంభాలు పేక మేడలా కూలిపోతున్నాయి.. కొత్త, పాత తేడా లేకుండా కుప్పకూలుతున్నాయి.. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని పాతేప్పుడు గుంతలు లోతుగా తీయకపోవడం.. సిమెంట్, కాంక్రీట్ తగిన ప్రమాణాల్లో కలిపి వాడకపోవడం.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. స్తంభాల తయారీలో నాణ్యత పాటించకపోవడం.. వినియోగదారుల పాలిట శాపంగా మారింది. గాలిదుమ్ము ప్రభావం వల్ల స్తంభాలు ఎప్పుడు కూలుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఖమ్మం: టీఎస్ ఎన్‌పీడీసీఎల్ ఖమ్మం సర్కిల్ పరిధిలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని అమరుస్తుంటారు. ఈ ఏడాది సర్కిల్ పరిధిలో మొత్తం 7,439 విద్యుత్ స్తంభాలను కొత్తగా ఏర్పాటు చేశారు. అయితే ఇవి కొద్దిరోజులకే కూలిపోతుండటం వల్ల నాణ్యత విషయంలో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలు పూర్తిగా దెబ్బతిని, పాడైపోయిన సమయంలో వాటిని తొలగించి.. కొత్తవి ఏర్పాటు చేసేటప్పుడు అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలి.
గుంతలు తీసే సమయంలో సరైన లోతులో తవ్వించాలి.. పైపైన తవ్వడం వల్ల స్తంభానికి పటుత్వం ఉండదు.. స్తంభాన్ని పాతేటప్పుడు సిమెంట్, కాంక్రీట్ తగిన మోతాదులో వేయాల్సి ఉండగా.. వీటి విషయంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న స్తంభాల నాణ్యత కూడా బాగా లేదని పలువురు పేర్కొంటున్నారు. సాక్షాత్తు ఎన్‌పీడీసీఎల్ అధికారులు సైతం విద్యుత్ స్తంభాల నాణ్యత విషయంలో పెదవి విరుస్తున్నారు.
తయారు చేసే సమయంలోనే స్తంభాలు కొన్నిచోట్ల విరిగిపోయి.. మరికొన్ని చోట్ల నాణ్యత లోపంతో ఉంటున్నాయని.. పకడ్బందీగా తయారు చేయకపోవడం వల్లే చిన్నపాటి గాలిదుమ్ము వచ్చినా విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి.ప్రస్తుత వేసవి కాలంలోనే ఇలా ఉంటే.. వచ్చే వర్షాకాలంలో పలుసార్లు గాలిదుమ్ములతో కూడిన వర్షాలు పడితే విద్యుత్ స్తంభాలు పూర్తిగా దెబ్బతింటాయని వినియోగదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గాలిదుమ్ము, వర్షాల వల్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగితే విద్యుత్ సరఫరాకు తరచు అంతరాయం కలుగుతుందని, వాటిని మళ్లీ పునరుద్ధరించే వరకు ఇబ్బందిపడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. అలా కాకుండా అధికారులు విద్యుత్ స్తంభాల ఏర్పాటు విషయంలో శ్రద్ధ తీసుకుని.. నాణ్యతగా ఉన్న వాటిని ఏర్పాటు చేయడంతోపాటు స్తంభాల తయారీ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
టెండర్ల విధానంతోనే..
గతంలో కరీంనగర్‌లో ఎన్‌పీడీసీఎల్ సొసైటీ ద్వారా విద్యుత్ స్తంభాలు సరఫరా అయ్యేవి. ఇక్కడి ఎన్‌పీడీసీఎల్ అధికారుల పర్యవేక్షణలో స్తంభాలు తయారయ్యేవి. దీంతో నాణ్యత విషయంలో ఎటువంటి ఢోకా ఉండేది కాదని పలువురు ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. అయితే నాలుగేళ్లుగా టెండర్ విధానం ద్వారా స్తంభాలను తయారు చేస్తున్నారు. ఇందుకోసం 9.1 మీటర్ విద్యుత్ స్తంభానికి రూ.4,500, ఎనిమిది మీటర్ల స్తంభానికి రూ.3వేల చొప్పున సదరు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తున్నారు.
దీంతో విద్యుత్ స్తంభాల్లో నాణ్యత కొరవడినట్లు తెలుస్తోంది. అలాగే స్తంభాల ఏర్పాటు సమయంలో ఎన్‌పీడీసీఎల్ అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. కాగా.. స్తంభాల నాణ్యత, ఏర్పాటులో అలసత్వంపై ఎన్‌పీడీసీఎల్ ఖమ్మం సర్కిల్ ఇన్‌చార్జ్ డీఈ రాములును ‘సాక్షి’ వివరణ కోరగా.. స్తంభాల నాణ్యతపై ఇప్పటివరకు తమకెలాంటి ఫిర్యాదులు రాలేదు. ఎక్కడైనా స్తంభాల ఏర్పాటులో పొరపాట్లు జరిగితే అవి పడిపోయే అవకాశం ఉందని వివరించారు.