ఉపాధి కూలీ .. ఎండలతో హడలి!
ఉపాధి కూలీ .. ఎండలతో హడలి!
Published Thu, Feb 23 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM
సూర్య ప్రతాపం
– ముందుకు సాగని ఫారంపాండ్స్ పనులు
– మార్చి నాటికి 9,992 ఫారంపాండ్స్ పూర్తి చేయాలనేది లక్ష్యం
– 89వేల మందికి మించని కూలీలు
– చెల్లించాల్సిన బకాయి రూ.9 కోట్లు
ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 39.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. గ్రామాల్లో ఉపాధి పనులకు వెళ్లేందుకు కూలీలు హడలిపోతున్నారు. తెల్లవారుజామున వెళ్లినా.. 10 గంటలు దాటకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో ఉపాధి పనులు ముందుకు సాగని పరిస్థితి. ఈ నేపథ్యంలో మార్చి నెలాఖరు నాటికి లక్ష్యం చేరుకోవడం ప్రశ్నార్థకం అవుతోంది.
కర్నూలు(అర్బన్):
గత ఏడాది అక్టోబర్ నుంచి వర్షాల జాడ కరువయింది. భూములు తడారి నెలలన్నీ గట్టిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఉపాధి కూలీలకు పనులు చేయడం కష్టతరమవుతోంది. వంకలు, వాగులు, చెరువుల్లో పూడికతీత పనులపై ఆసక్తి కనబరుస్తున్నారు తప్పిస్తే ఫారంపాండ్స్‌ను పట్టించుకోని పరిస్థితి. పూడికతీతకు ఒక క్యూబిక్ మీటర్ తవ్వితే రూ.84 కాగా, ఫారంపాండ్స్ పనుల్లో ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.214 ఇస్తున్నా, కూలీలు నేల గట్టిగా ఉండడం, ఎండలు మండిపోతున్న కారణాల వల్ల అయిష్టంగా ఉన్నారు. దీంతో జిల్లాలో ఫారంపాండ్స్ పరిస్థితి ఆశించిన రీతిలో సాగడం లేదు. పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అక్కడక్కడ వ్యవసాయ పనులు ఉన్న కారణంగా కూడా కూలీలు ఉపాధి పనులకు వచ్చేందుకు మక్కువ చూపడం లేదు. ప్రతి రోజు 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు కూలీలు వస్తే అన్ని రకాల ఉపాధి పనులు నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 89వేలకు మించి కూలీలు రావట్లేదు.
మార్చి నాటికి 9,992 ఫారంపాండ్స్ పూర్తి సాధ్యమేనా!
జిల్లాకు మొత్తం 80,329 ఫారంపాండ్స్ మంజూరు కాగా.. 36,169 పనులు ప్రారంభించారు. ఇందులో 26,177 ఫారంపాండ్స్ పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 9,992 పనులను పూర్తి చేయాల్సి ఉంది. కూలీ గిట్టుబాటు కాకపోవడం వల్ల కూడా ఈ పనుల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాలోని 150 నుంచి 200 గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు లేరు. ఆయా ప్రాంతాల్లోని సీనియర్ మేటీలే మూడు, నాలుగు గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న పనులను పర్యవేక్షించాల్సి వస్తున్నందున పనులు ఎక్కడికక్కడ ఉండిపోతున్నాయి. పైపెచ్చు సీనియర్ మేటీలను కూడా ఆయా గ్రామాల్లోని జన్మభూమి కమిటీలు సిఫారసు చేయాల్సి ఉంది. ఇందులో కూడా రాజకీయాలు చోటు చేసుకోవడం వల్ల పనుల్లో వేగం తగ్గుతోంది.
కూలీల బకాయి రూ.9 కోట్లు
పలు ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు కూలి చెల్లించే విషయంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల నుంచి ఇంకా పలు పోస్టాఫీసులకు నగదు చేరకపోవడంతో ఆయా ప్రాంతాల్లో కూలీలు చెల్లించనట్లు తెలుస్తోంది. అలాగే కూలీలకు సంబంధించిన బ్యాంకు ఖాతా నెంబర్లకు ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఎన్‌సీపీఐ డాటాలో సింక్ కాకపోవడం వల్ల కూడా కూలీలకు వేతనం డబ్బు అందనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూలీలకు ఇంకా రూ.9 కోట్లు చెల్లించాల్సి ఉంది.
Advertisement