సాక్షి, కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఈ చిత్రంలో ఉండే వ్యక్తి పేరు రసూల్. పదవ తరగతి వరకు చదువుకున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉపాధి దొరకడం లేదని నిరాశ పడలేదు. కూటి కోసం కోటి విద్యలు ఉంటాయనే సిద్ధాంతాన్ని నమ్మాడు. షరాఫ్ బజార్ గేటు పక్కన ఒక మీటరు ఖాళీ స్థలం ఉంటే అక్కడ పూసలు గుచ్చే పనికి శ్రీకారం చుట్టారు. క్రమేపీ ఈ వృత్తిలో రాణించవచ్చనే స్థైర్యం వచ్చింది. రోజూ పూసలు గుచ్చగా వచ్చిన సంపాదనతో కుటుంబ పోషణ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతను తన ముగ్గురు అమ్మాయిలను బాగా చదివించుకుంటున్నాడు. నగరంలో ఓ ఇరవై మంది ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు.
జిల్లాలోని నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో కూడా బంగారు అంగళ్ల వద్ద ఈ వృత్తి కొనసాగించే వారు పదుల సంఖ్యలో ఉన్నారు. వీరి వద్ద నల్లపూసల దండలు, క్రిస్టల్, స్పిన్నల్, ముత్యాల దండలు లభిస్తాయి. పూసలు ఏడు రకాల రంగుల్లో ఉంటాయి. కస్టమర్ల కోరిన డిజైన్లలో వాటిని దారంలో గుచ్చి ఇస్తుంటారు. బంగారు చెయిన్లలో తాళీబొట్లు అమరుస్తారు. ఫ్యాన్సీ దండలు కూడా ఉంటాయి. నల్లపూసల్లో మెరిసేటివి సన్నవి, లావువి అంటూ ఓ పది రకాలుంటాయి. వాటిని రూ. 100 మొదలు రూ. 500ల వరకు ధరకు అమ్ముతారు. మెటీరియల్ తెచ్చుకున్న వారి వద్ద కూలీ మాత్రమే తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment