గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం
కేంద్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల
దక్షిణ రాష్ట్రాల చైర్మన్ చంద్రమౌళి
నెల్లూరు(బారకాసు): ఖాదీతో పాటు గ్రామీణ పరిశ్రమలను, చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర గ్రామీణ పరిశ్రమల దక్షిణ రాష్ట్రాల చైర్మన్ జి.చంద్రమౌళి పేర్కొన్నారు. శనివారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేతి వృత్తులకు ఆదరణ లేకపోవడంతో నానాటికి కనుమరుగవుతున్నాయన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల వారు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈవిషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పరిశ్రమలు, చేతివృత్తుల అభివృద్ధికి కృషి చేసేందుకు ప్రణాళికా బద్ధంగా తగు చర్యలు చేపట్టిందన్నారు.
అలాగే ఖాదీ పరిశ్రమల అభివృద్ధికి దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి బెంగళూరులో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.33వేల కోట్లు ఖాదీ పరిశ్రమలకు ఖర్చు చేసిందన్నారు. దీంతో గత ఏడాది కంటే రూ.16శాతం అదనంగా ఖాదీ ఉత్పత్తులు జరిగాయని చెప్పారు. ఖాదీ ఉత్పత్తులకు విశేష ప్రాచుర్యం కల్పించేందుకు కొత్త అవుట్‌లెట్స్ ఏర్పాటు చేశామన్నారు. ఖాదీతో పాటు, గ్రామీణ పరిశ్రమలు, చేతి వృత్తులకు అంతర్జాతీయ స్థారుు గుర్తింపు తెచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. వెంకటగిరి చేనేత కార్మికులకోసం రూ.3కోట్లతో సిల్క్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే కళంకారిని అంతర్జాతీయ స్థారుుకి తీసుకెళ్లేందుకు చిత్తూరు, శ్రీకాళహస్తిలో క్లస్టర్స్ మంజూరు చేశామన్నారు. మూడు గంటల సమయంలో విగ్రహాలు తయారు చేసే విశ్వకర్మలకు కేవలం గంటకే విగ్రహం తయారు చేసేందుకు అనువైన కొత్తరకం పనిముట్లు శ్రీకాళహస్తి, కర్నూలు, ఆళ్లగడ్డలో వారికి అందజేశామన్నారు.
పార్టీ పటిష్టత కోసం కృషి
బీజేపీని క్షేత్రస్థారుులో పటిష్ట పరిచేందుకు తగిన కృషి చేస్తున్నామని ఆ పార్టీ బూత్‌కమిటీల జిల్లా ఇన్‌చార్జి బత్తల నరసింహరావు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్‌గౌడ్ పాల్గొన్నారు.