ఇంజినీరింగ్ విద్యార్థులు
♦షెడ్యూల్ విడుదల
♦ 23, 24 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన
♦ 26న ఎలాట్ మెంట్లు ప్రకటన
♦ కళాశాలలు, బ్రాంచ్‌లు మార్పుకు చివరి అవకాశం
♦ గతంలో హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం
ఎచ్చెర్ల: ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్–2016 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్ జూన్ 6 నుంచి 18 వరకు జరగగా, జూలై ఒకటి నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ కౌన్సెలింగ్ పూర్తయి, తరగతులు సైతం ప్రారంభమయ్యాయి. కళాశాలల్లో ప్రస్తుతం ఖాళీ సీట్లకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. బ్రాంచ్‌లు, ప్రస్తుతం విద్యార్థులు చదువుతున్న కళాశాలు సైతం మారవచ్చు. రెండో కౌన్సెలింగ్ విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యం.
ఈనెల 23, 24 తేదీల్లో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. కొత్తగా ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు హాజరయ్యే విద్యార్థులు పరిశీలన అనంతరం ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 26న ఎలాట్ మెంట్లు ప్రకటిస్తారు. ఇప్పటికే కళాశాలల్లో తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు సైతం ఆప్షన్లు మార్చు కోవచ్చు.
జిల్లాలో ఇదీ పరిస్థితి...
మొదటి విడత కౌన్సెలింగ్‌కు జిల్లా నుంచి 2,825 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలోని ఏడు ఇంజినీరింగ్ కళాశాలల్లో 2,688 సీట్లు ఉండగా, 1816 సీట్లు నిండాయి. మరో పక్క ఎలాట్ మెంట్లు ఇచ్చిన విద్యార్థులు కళాశాలకు రిపోర్టు చేయలేదు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చేరిన విద్యార్థులతో ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ అయ్యాయి. వీటికోసం విద్యార్థులు కొత్తగా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఉన్నత విద్యా మండలి 22వ తేదీన అన్ని కళాశాలల్లో సీట్లు ఖాళీలు వివరాలు ఉన్నత విద్యామండలి వెబ్ సైట్‌లో పెట్టనుంది. ఖాళీలు ఆధారంగా విద్యార్థులు కళాశాలలు, బ్రాంచ్‌లు మార్చుకునే అవకాశం లభిస్తుంది.