చిత్తూరు: జల్సాలకు అలవాటు పడిన ఇంజనీరింగ్ విద్యార్థి అవి తీర్చుకునేందుకు... డబ్బుల కోసం నేరుగా ప్రజా ప్రతినిధులనే బెదిరిస్తూ పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న జగన్ అనే యువకుడు ఇంటర్నెట్ ద్వారా పలువురు మంత్రులతోపాటు రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు సంపాదించారు.
ఆ క్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి కర్నూలు, హైదరాబాద్లో ఆస్తులున్నాయని .. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు బయటపెడతానని బెదిరించాడు. అలా చేయకుండా ఉండేలంటే... పద్మావతి మహిళ బ్యాంకులలోని ఓ ఖాతాలో రూ. 30 వేలు వేయ్యాలని ఫోన్లో సందేవం పంపాడు. దీంతో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో చిత్తూరుకు చెందిన జగన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, ఆళ్లగడ్డ, శ్రీశైలం ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లు కూడా సంపాదించినట్లు తమ విచారణలో వెల్లడించాడని పోలీసులు చెప్పారు.