విద్యార్థినిలకు బ్లాక్‌మెయిల్‌..స్పందించిన సీఎం | Students Complaint Cm Jagan Against Venkata Vijaya Nursing College Tirupathi | Sakshi
Sakshi News home page

విద్యార్థినిలకు బ్లాక్‌మెయిల్‌..స్పందించిన సీఎం

Published Tue, Jun 25 2019 10:16 AM | Last Updated on Tue, Jun 25 2019 10:17 AM

Students Complaint Cm Jagan Against Venkata Vijaya Nursing College Tirupathi - Sakshi

‘సరస్వతీ నిలయాన్ని జైలుగా మార్చారు. అక్కడ చదువు చెప్పకపోగా.. విద్యార్థినులు చేసే చిన్న తప్పులతో బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. వారిని తమ కళాశాల అనుమతుల కోసం, అధికారుల అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇంటి నుంచి వంట పనివరకు అన్నీ చేయిస్తారు. అర్ధరాత్రుల్లో హాస్టల్‌కు వచ్చే ప్రైవేటు వ్యక్తులకు సైతం అన్ని రకాల సేవలు చేయాలి. లేకుంటే వేధింపులు తప్పవు. ‘మాకు న్యాయం చేయండి’ అంటూ శ్రీ వెంకట విజయ నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ–మెయిల్‌ ద్వారా ఆధారాలు అందజేశారు. దీనిపై ఆయన స్పందించారు. ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. అదే కళాశాలకు చెందిన మరికొందరు విద్యార్థులు తిరుపతి సబ్‌కలెక్టర్‌ ముందు కన్నీరు మున్నీరయ్యారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 

సాక్షి, తిరుపతి : పవిత్రమైన వృత్తి కోసం నర్సింగ్‌ కోర్సులో చేరిన విద్యార్థినుల జీవితాలతో ఆ కళాశాల యాజమాన్యం ఆడుకుంటోంది. చదువుల నిలయాన్ని నరకకూపంగా మార్చింది. ఈ దారుణాల వేదిక ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. తిరుపతి రూరల్‌ మండలం పుదిపట్ల పంచాయతీ పరిధిలోని శ్రీవెంకట విజయ నర్సింగ్‌ కళాశాల. విద్యార్థులు సోమవారం తిరుపతి సబ్‌కలెక్టర్, తిరుపతి అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాలు.. ‘వందలాదిమంది ఉన్న శ్రీవెంకట విజయ నర్సింగ్‌ కళాశాల నాలుగేళ్ల కోర్సుకు ఇద్దరు అధ్యాపకులు బోధన చేస్తారు. కోర్సు పూర్తి కాకుండానే సర్టిఫికెట్‌ ఇప్పిస్తారు.

ఇలాంటి సర్టిఫికెట్లతోనే ప్రైవేటు ఆస్పత్రుల్లో విధులకు పంపుతారు. వచ్చే జీతం సైతం కళాశాల యాజమాన్యమే బలవంతంగా లాక్కుంటుంది. కళాశాలతో పాటు హాస్టల్‌ భవనాలకు సైతం అనుమతులు ఉండవు. కళాశాల నిర్వాహకురాలు విజయ పెడుతున్న బాధలను భరించలేకపోతున్నాం. వంటతో పాటు పొలంలో పనులు సైతం విద్యార్థినులతో చేయిస్తున్నారు. కళాశాల నిర్వాహకురాలు నుంచి మాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి’ అని విద్యార్థినులు వేడుకున్నారు. 

ముఖ్యమంత్రికి ఫిర్యాదు
ఎస్వీవీ నర్సింగ్‌ కళాశాల నిర్వాహకురాలు విజయ పెడుతున్న వేధింపులు, గృహహింసపై విద్యార్థినులు కలెక్టర్, అర్బన్‌ ఎస్పీ, సబ్‌కలెక్టర్, తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అధికారులు, పోలీసులు సైతం కళాశాలకు వచ్చి విద్యార్థినులను విచారించకుండానే యాజమాన్యంతో చర్చలు జరుపుకుని, కాసుల మోజులో అన్యాయం చేశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా న్యాయం జరగకపోవడంతో ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. గృహహింస, వేధింపులు, కళాశాల అక్రమాలకు సంబంధించి ఆధారాలతో వీడియోలను, ఫిర్యాదును పంపించారు. స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో విద్యార్థినుల ఆవేదనను, వారి బాధలతో కూడిన లేఖను చూపించారు. అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. విద్య, విద్యార్థుల సౌకర్యాలు, భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేశారు.

కళాశాల మూసివేస్తున్నట్లు ప్రకటన
విద్యార్థినుల ఫిర్యాదుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేగంగా స్పందించారని తెలుసుకున్న ఎస్వీవీ నర్సింగ్‌ కళాశాల యాజమాన్యం తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది. అధికారులు ఎక్కడ దాడులు చేస్తారోనని అప్రమత్తం అయ్యింది. కళాశాల సూచిక బోర్డును తీసివేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాలను మూసివేసినట్లు నిర్వాహకురాలు విజయ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కావాలనే కొందరు తమ కళాశాలపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని, కళాశాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఆ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి
తిరుపతి మంగళం: శ్రీవేంకటేశ్వర నర్సింగ్‌ కళాశాల గుర్తింపును రద్దుచేసి, కరస్పాం డెంట్‌ బండి విజయపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని తిరుపతి సబ్‌ కలెక్టర్‌కు సోమవారం పలువురు విద్యార్థినులు విజ్ఞప్తి చేశారు. స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో హ్యూమన్‌ రైట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో బాధిత నర్సింగ్‌ విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. కళాశాల కరస్పాండెంట్‌ అన్ని పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వమంటూ, ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గిస్తామంటూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. 150 మంది విద్యార్థినులకు కనీస విద్యార్హత లేని ఒకే ఉపాధ్యాయుడు బోధించడం ఏంటని ప్రశ్నించారు. విజయ వేధింపులు తాళలేక పది మంది హాస్టల్‌ నుంచి బయటకు వచ్చి హ్యూమన్‌ రైట్స్‌ ప్రతినిధుల సంరక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. తాము అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్లు విజయ తల్లిదండ్రులకు ఫోన్‌చేసి అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు వాపోయారు. ఆమెపై పోలీసు ఉన్నతాధికారులు లోతైన విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

కళాశాలపై ప్రభుత్వ విచారణ
తిరుపతిక్రైం: తిరుపతి రూరల్‌ పరిధిలోని పుదిపట్ల గ్రామంలోని శ్రీ వెంకట విజయ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ కరస్పాండెంట్‌ బండి విజయపై కళాశాల విద్యార్థినులు చేస్తున్న ఆరోపణలు ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ఈ కళాశాలలో జరిగే అవినీతి, అక్రమాలు, సౌకర్యాలు లేమిపై పలు వివాదాలు రావడంతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి స్పందించారు. దీనిపై విచారించాల్సిందిగా కలెక్టర్‌ భరత్‌నారాయణ గుప్తను ఆదేశించడంతో శ్రీపద్మావతమ్మ గవర్నమెంట్‌ నర్సింగ్‌ కళాశాలలోని ఇద్దరు అధ్యాపకులతో ఈ విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీతో పాటు ముత్యాలరెడ్డి పల్లె పోలీసుల పర్యవేక్షణలో బాధితుల నుంచి ఫిర్యాదులను వీడియో ద్వారా చిత్రీకరించారు. సోమవారం తిరుపతి అర్బన్‌ జిల్లా కార్యాలయంలో అదనపు ఎస్పీ కలిసిన ఆ కళాశాల నర్సింగ్‌ విద్యార్థుల నుంచి పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. వారితో పాటు విచారణ బృందం విద్యార్థులు సమావేశమైంది. వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. దీనిపై దర్యాప్తును కౌనసాగిస్తున్నామని ఎమ్మార్‌పల్లి సీఐ మసూరుద్దీన్‌ వెల్లడించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement