హరితహారంపై ఆరా
-
పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారుల వివరాల సేకరణ
-
రోజు వారీగా నివేదికలు పంపుతున్న అధికారులు
-
నిర్లక్ష్యం వీడని పలు శాఖలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : హరితహారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా నిత్యం ఎన్ని మొక్కలు నాటారు.. ఏయే శాఖలు నాటిన మొక్కలెన్ని.. పాల్గొన్న ప్రజాప్రతినిధులెవరు..? వంటి అన్ని అంశాలపై రోజువారి నివేదికలు ఇవ్వాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు ప్రభుత్వానికి పంపుతున్నారు.
మొక్కలు నాటడంలో ఆయా శాఖలకు నిర్దేశిత లక్ష్యం ఎంత..? ఈ రోజు ఎన్ని మొక్కలు నాటారు.. శాఖల వారీగా వివరాలు పంపిస్తున్నారు. మొక్కలు నాటడంలో నిర్దేశిత లక్ష్యం పూర్తి చేసుకున్న గ్రామాల వివరాలు కూడా ఈ నివేదికల్లో పేర్కొంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వంటి అంశాలను నివేదికల్లో పేర్కొంటున్నారు.
రాష్ట్రంలోనే మొదటి స్థానం..
ఈ పథకం అమలులో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఏ జిల్లాలో లేనివిధంగా అత్యధికంగా 1.08 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8న హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. ఎనిమిది రోజుల్లో జిల్లాలో కోటికి పైగా మొక్కలు నాటడం గమనార్హం. వారం రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటడానికి అనువైన వాతావరణం ఉంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంపై దృష్టి సారించారు. కలెక్టర్ జగన్మోçßæన్ కూడా నిత్యం అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
లక్ష్యానికి మించి నాటిన పోలీసు శాఖ..
జిల్లాలో పోలీసు శాఖకు నిర్దేశించిన లక్ష్యం కంటే దాదాపు రెట్టింపు మొక్కలు నాటినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. ఈ శాఖ ఆధ్వర్యంలో 6 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటివరకే 11.13 లక్షల మొక్కలు నాటినట్లు రికార్డుల్లో పేర్కొంటున్నారు. డ్వామా ద్వారా మొత్తం రెండు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణతో ఈ విభాగం పనిచేస్తోంది. ఇప్పటివరకు 67.28 లక్షల మొక్కలు నాటినట్లు పేర్కొంటున్నారు.
అటవీ శాఖ టెరిటోరియల్ విభాగానికి 1.33 కోట్ల మొక్కలు పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 13.01 లక్షల మొక్కలు నాటగలిగారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కలెన్నో లెక్కలు లేకుండా పోయాయి. ఈ సమాచారం నివేదికల్లో కనిపించడం లేదు. అలాగే రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కల సంఖ్య నామమాత్రంగా ఉంది. ఇలా మొత్తం 17 ప్రభుత్వ శాఖలకు సంబంధించి రోజు వారి నివేదికలను సేకరిస్తున్నారు.