పండుగ పూట.. ప‘రేషన్‌’ | epass machines not worked | Sakshi
Sakshi News home page

పండుగ పూట.. ప‘రేషన్‌’

Published Sat, Jan 7 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

పండుగ పూట.. ప‘రేషన్‌’

పండుగ పూట.. ప‘రేషన్‌’

- మొరాయిస్తున్న ఈ-పాస్‌ సర్వర్లు
- చాలాప్రాంతాల్లో అందని సిగ్నల్స్‌
-నత్తనడకన సరుకుల పంపిణీ
-డీలర్లు, కార్డుదారుల అవస్థలు


జిల్లాలో చౌక దుకాణాలు : 2,962
రేషన్‌కార్డులు : 11,20,323
లబ్ధిదారులు : 34,45,290
6వ తేదీ సాయంత్రానికి రేషన్‌ తీసుకున్న కార్డుల సంఖ్య : 6,05,888  


‘‘వీరు ఉపాధి పనుల కోసమో లేక ట్రెక్కింగ్‌ పేరిట కొండెక్కుతున్నారని అనుకుంటున్నారా? అదేమీ కాదు! రేషన్‌ సరుకులు తీసుకోవడానికి పడుతున్న అవస్థలివి. మడకశిర మండలం ఏఆర్‌రొప్పంలో ఈ-పాస్‌ సిగ్నల్స్‌ రాకపోవడంతో స్థానిక డీలర్‌, కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికారణంగా ఈ నెల ఒకటి నుంచి ఇప్పటిదాకా ఆరుగురికి మాత్రమే సరుకులు ఇచ్చారు.474 మంది కార్డుదారులు మిగిలివున్నారు. వీరంతా శుక్రవారం డీలర్‌తో కలిసి ఈ-పాస్‌ యంత్రాన్ని తీసుకుని సమీపంలోని కొండపైకి వెళ్లారు. అక్కడా సిగ్నల్స్‌ రాలేదు. సమీప పొలాలన్నీ కలియదిరిగారు. అయినా ఫలితం లేదు. దీంతో నిరాశగా ఇంటిముఖం పట్టారు.’’
 
ధర్మవరం : చౌక దుకాణాలలో ఈ–పాస్‌ యంత్రాలు కార్డుదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. గంటల తరబడి రేషన్‌షాపుల వద్ద వేచి చూస్తున్నా..సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం సంక్రాంతి పండుగ నాటికైనా అందుతాయో..లేదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఏ చౌకడిపో వద్ద చూసినా బారులుతీరి కనిపిస్తున్నారు. ఇన్నాళ్లూ నగదు కోసం బ్యాంకుల వద్ద క్యూలో నిల్చున్న జనం.. ఇప్పుడు సర్వర్లు సరిగా పని చేయని కారణంగా చౌకడిపోల వద్ద వేచివుండాల్సి వస్తోంది. జిల్లాలో 11,20,323 రేషన్‌ కార్డులకు సరుకులు అందజేయాల్సి ఉండగా.. శుక్రవారం సాయంత్రానికి 6,05,888 కార్డులకు మాత్రమే (54 శాతం) పంపిణీ చేశారు.

సామర్థ్యం లేని సర్వర్లు
    ఈ–పాస్‌ విధానం మొత్తం ఆన్‌లైన్‌ ద్వారా నడిచే వ్యవహారం. రేషన్‌కార్డులో ఉన్న లబ్ధిదారులలో ఎవరిదో ఒకరి వేలి ముద్రలను ఈ పాస్‌ యంత్రం ద్వారా తీసుకొని సరుకులు అందజేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం అన్ని అంశాలను ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తుండటంతో ఈ సర్వర్ల వేగం పూర్తిగా మందగించింది.  దీంతో ఒక్కో లబ్ధిదారుడి వివరాలు సేకరించేందుకు  20 నుంచి 30 నిమిషాలు పడుతోందని డీలర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చాలా మంది డీలర్లు తెల్లవారుజాము నుంచే రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు మాత్రమే సర్వర్‌ వేగంగా పని చేస్తోందని, 10ఽ నుంచి సాయంత్రం ఏడు వరకు పూర్తిగా నిదానమవుతోందని డీలర్లు చెబుతున్నారు. ధర్మవరంలో 48,607 కార్డులు ఉండగా 59.30 శాతం మందికి మాత్రమే పంపిణీ చేశారు. ఇక అత్యల్పంగా గుమ్మఘట్ట మండలంలో 14,436 కార్డులకు గాను 11.21 శాతం పంపిణీ జరిగింది. పరిగి, పుట్టపర్తి, గాండ్లపెంట, తలుపుల, ఉరవకొండ మండలాల్లోనూ ఇదే పరిస్థితి.

నాలుగు రోజులుగా తిరుగుతున్నా
నాలుగు రోజుల నుంచి సరుకుల కోసం తిరుగుతున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా 20 మందికి కూడా వేయలేదు. ఏమంటే వేలి ముద్రలు తీసుకోలేదని చెబుతున్నారు.. పండుగపూట కూలికి పోకుండా స్టోర్‌ వద్ద ఉండాల్సి వస్తోంది.
- రాములమ్మ, దుర్గానగర్‌, ధర్మవరం

పండుగపూట ఎన్ని ఇబ్బందులో..
స్టోర్‌లో సరుకులు తీసుకోవడం  రోజురోజుకూ కష్టమవుతోంది. మూన్నాళ్లుగా పని వదిలేసి స్టోరు దగ్గరే ఉంటున్నా సరుకులు ఇవ్వలేదు. ఏమంటే సర్వర్‌ పనిచేయలేదట.రేపు రమ్మన్నారు. రేపన్నా ఇస్తారో, లేదో!
- లక్ష్మిదేవి, సత్యసాయినగర్‌, ధర్మవరం

పాతపద్ధతిలోనే పంపిణీ చేయాలి
గ్రామంలో ఈ-పాస్‌ సిగ్నల్స్‌ రాక సరుకులను తీసుకోవడానికి ఇబ్బంది అవుతోంది. ఐదు రోజుల నుంచి స్టోర్‌ వద్దకు తిరుగుతున్నా ఫలితం లేదు. పాత పద్ధతి ద్వానే సరుకులను పంపిణీ చేయాలి.- గంగమ్మ, ఏఆర్‌ రొప్పం, మడకశిర మండలం

సర్వర్‌ డౌన్‌ వాస్తవమే
రేషన్‌ పంపిణీ చాలా ఆలస్యంగా జరుగుతున్నది వాస్తవమే. రెండు రోజులుగా సర్వర్‌ పూర్తిగా డౌన్‌ అయిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి మాత్రం వేగంగా జరుగుతోంది. ఈ పరిస్థితి ఇలానే ఉంటే ఎవరికీ ఇబ్బంది లేకుండా వీఆర్‌ఓ అథెంటిఫికేషన్‌ ద్వారా సరుకులు అందేలా చూస్తాం.
- నారాయణమూర్తి, ఇన్‌చార్జ్‌ తహశీల్దార్‌, ధర్మవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement