తాత్కాలిక సచివాలయానికి రోజురోజుకూ పెరుగుతున్న అంచనా వ్యయం
అదనపు పనులకోసమంటూ మరో రూ.28.5 కోట్లు
తాజాగా టెండర్లు ఆహ్వానించిన సీఆర్‌డీఏ
మౌలిక వసతులకు మరో రూ.40 కోట్లు వెచ్చించే చాన్స్
దీంతో అంచనా వ్యయం 269.50 కోట్లకు చేరే అవకాశం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం అంచనా వ్యయం అంతకంతకూ పెరిగిపోతోంది. మొదట రూ.170 కోట్లతో మొదలైన అంచనా వ్యయం రూ.201 కోట్లకు పెరగడం తెలిసిందే. తాజాగా అదనపు పనుల పేరిట మరో రూ.28.44 కోట్ల పనులకు సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. దీంతో అంచనా వ్యయం రూ.229.50 కోట్లకు పెరిగిపోయింది. అయితే ఇంతటితో అయిపోయేలా లేదు. నిర్మాణం పూర్తయ్యేలోపు మరో రూ.40 కోట్లవరకు వెచ్చించేందుకు సీఆర్‌డీఏ సిద్ధమవుతోంది.
తాత్కాలిక ఏర్పాటుకోసం ఇంత భారీఖర్చు ఏమిటని అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం లెక్కచేయట్లేదు. అదేమంటే ఈ భవనాల్ని ఆ తర్వాత వాణిజ్య అవసరాలకు వినియోగిస్తామని, తాత్కాలికం కాదని చెబుతోంది. అలాగైనా ఒక వాణిజ్య సముదాయానికి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని నిపుణులంటున్నారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి ఈనెల 17న సీఎం శంకుస్థాపన చేయడం తెలిసిందే. ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+7 పునాదితో జీ+1 భవనాలు ఆరింటిని నిర్మిస్తోంది. నాలుగు భవనాల్ని ఎల్ అండ్ టీ, రెండింటిని షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు నిర్మిస్తున్నాయి.
అదనపు పనుల పేరిట వ్యయాన్ని పెంచేస్తున్న ప్రభుత్వం..
ఈ భవనాల నిర్మాణానికి మొత్తం రూ.170 కోట్లు ఖర్చవుతుందని సీఆర్‌డీఏ తొలుత టెండర్లలో అంచనా వేసింది. చదరపు అడుగుకు రూ.మూడువేల చొప్పున ఇస్తామంటూ టెండర్లు ఆహ్వానించినా ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు రూ.4,500 వరకూ కోట్ చేసి బిడ్లు వేశాయి. దీనిపై హైడ్రామా సృష్టించి చివరికి చదరపు అడుగుకు రూ.3,350 ఇచ్చేందుకు ఆ కంపెనీల్ని ప్రభుత్వం ఒప్పించింది.
ఇలా ఎక్సెస్ టెండర్లు ఆమోదించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో సీఆర్‌డీఏను పక్కనపెట్టి ఏకంగా మంత్రివర్గం దీనికి ఆమోదముద్ర వేసింది. దీంతో రూ.170 కోట్ల అంచనావ్యయం కాస్తా రూ.201 కోట్లకు చేరింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తినా పట్టించుకోని ప్రభుత్వం అదనపు పనుల పేరుతో వ్యయాన్ని ఇంకా పెంచేస్తోంది. తాజాగా రూ.28.44 కోట్ల పనులకు సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది.
అదనపు విద్యుత్ సదుపాయాల కల్పనకు రూ.9,08,12,342, అదనపు నీటిసరఫరాకు రూ.2,11,99,496, అదనపు సివిల్ పనులకు రూ.17,24,48,797 చొప్పున అంచనాతో టెండర్లు ఆహ్వానించింది. దీంతో అంచనా వ్యయం రూ.201 కోట్ల నుంచి రూ.229.5 కోట్లకు పెరిగింది. ఈ అంచనాలు మరో రూ.40 కోట్ల వరకు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఆరు భవనాలు నిర్మిస్తున్న కంపెనీలు రూ.201 కోట్లకు కేవలం సివిల్ వర్క్స్‌ను మాత్రమే చేపట్టనున్నాయి. అంటే స్కెలిటిన్ భవనాలు మాత్రమే సీఆర్‌డీఏకు అప్పగిస్తాయి. వాటికి ఇంటీరియర్ డెకరేషన్, ఎలివేషన్ల ఖర్చు విడిగా ఉంటుందని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి. ఇది సుమారు రూ.20 కోట్లకుపైనే ఉండవచ్చని అంచనా.
ఇవిగాక సచివాలయ భవన సముదాయంలో ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ, రోడ్లు, డ్రైనేజీ పనులకోసం మరో రూ.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం వ్యయం రూ.269.50 కోట్లకు చేరుతుందనేది ప్రస్తుత అంచనా. ఈ సొమ్ముతో శాశ్వత సచివాలయమే నిర్మించవచ్చనే వాదన వినిపిస్తోంది.
‘తాత్కాలికానికి’ మరింత అ‘ధనం’
Published Mon, Feb 29 2016 9:39 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM
Advertisement
Advertisement