'అభివృద్ధి కోరుకుంటే పోటీ నుంచి తప్పుకోండి'
కరీంనగర్: తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన విపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటే ఆయా పార్టీల అభ్యర్ధులు పోటీ నుంచి తప్పుకోవాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. టీఆర్ఎస్ అభ్యర్ధుల ఏకగ్రీవం కావడానికి అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మొత్తం 12 స్థానాలకు గాను అధికార పార్టీ టీఆర్‌ఎస్ అన్నింటికీ నామినేషన్లు వేసింది. కాంగ్రెస్ 5 చోట్ల మాత్రమే బరిలో నిలిచింది. టీడీపీదీ ప్రస్తుతం అదే పరిస్థితి. బీజేపీ అసలు ఈ ఎన్నికల బరిలోనే లేకపోవడం గమనార్హం. 12వ తేదీ నామినేషన్లకు ఉపసంహరణకు చివరితేదీ కాగా, 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీటికి పోలింగ్ నిర్వహిస్తారు. 30వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.