పచ్చని చెట్లే భావితరాలకు మెట్లు
పచ్చని చెట్లే భావితరాలకు మెట్లు
Published Wed, Jul 20 2016 9:53 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
మాచారెడ్డి : పచ్చని చెట్లే భావితరాలకు మెట్లని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా బుధవారం రత్నగిరిపల్లి, అక్కాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు వారం రోజుల తరబడి వర్షాలు పడుతుండేవని, ప్రస్తుతం అడవులు అంతరించిపోవడంతో వర్షాల జాడ కనబడక తాగునీటి కోసం అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం బాటలు వేయడానికి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. రైతాంగానికి తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ను అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వడమే కేసీఆర్ ధ్యేయమని అన్నారు. మరో రెండేళ్లలో సింగూరు నుంచి రూ. 4 వేల కోట్లతో మిగిలిన జిల్లాలకు తాగునీటి సౌకర్యం కల్పించడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. రూ. 40వేల కోట్లు కేవలం తాగునీటి కోసమే ఖర్చు చేస్తున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ పుష్కలంగా వర్షాలు కురిసి వాగులు, వంకలు పొర్లుతున్నాయని అన్నారు. నిజామాబాద్ జిల్లాతో పాటు వరంగల్, మెదక్, కరీంనగర్‌జిల్లాలో అడవులు అంతరించిపోవడం వల్ల వర్షాపాతం తక్కువగా నమోదై కరువు పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంపగోవర్ధన్, జెడ్పీటీసీ సభ్యురాలు గ్యార లక్ష్మిసాయిలు, ఏఎంసీ చైర్మన్ రాజమణి, టీఆర్‌ఎస్ నేతలు ముజీబొద్దీన్, లక్ష్మారెడ్డి, బుక్యానర్సింలు, అంజీనాయక్, బాల్‌రాజు, బాల్‌చంద్రం, శ్రీశైలం, నాగిరెడ్డి, శ్రీనివాస్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement