రైల్వే అంచనాలు తప్పాయ్!
రైల్వే అంచనాలు తప్పాయ్!
Published Sun, Aug 14 2016 9:37 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
పలుచగా పుష్కర యాత్రికులు
దాదాపు రైళ్లన్నీ ఖాళీయే
మూడోరోజే లక్ష దాటిన ప్రయాణికులు
సాక్షి, విజయవాడ :
గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఈసారి అంతే రద్దీ ఉంటుందని భావించిన రైల్వేశాఖ భారీగా ఏర్పాట్లు చేసినా ఆ స్థాయిలో స్పందన లేకపోవడంతో పునరాలోచనలో పడింది. కృష్ణా పుష్కరాలకు తొలి మూడు రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది వచ్చారని అంచనా వేస్తున్నారు. తొలిరోజు 47 వేల మంది రెండురోజు 77 వేల మంది, మూడవరోజు 1.5 లక్షమంది ప్రయాణికులు వచ్చారని ఆ శాఖ అంచనా. ప్రతి రోజు మూడు లక్షల మంది భక్తులు వస్తారని భావించిన రైల్వేశాఖ ఒకేరోజు ఐదు లక్షల మంది భక్తులు వచ్చినా తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. అయితే లక్షన్నర లోపే వచ్చారని స్పష్టమైంది.
శాటిలైట్ స్టేషన్లలో రద్దీ తక్కువే !
పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేయడంతో మధురానగర్, గుణదల, రాయనపాడు, కృష్ణాకెనాల్ స్టేషన్లను శాటిలైట్ స్టేషన్‌గా ప్రకటించి కొన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రైళ్లలో వచ్చి ఆయా స్టేషన్లలో దిగేభక్తుల సంఖ్య నామమాత్రంగానే ఉంది. ఒక్క గుణదల స్టేషన్‌లోనే రోజు వెయ్యి, పదిహేను వందల మంది భక్తులు దిగుతున్నారు. మిగిలిన మూడు స్టేషన్లలో రెండు, మూడు వందల మంది కంటే ఎక్కువ రావడం లేదని రైల్వే కమర్షియల్ కంట్రోల్ అధికారుల కథనం. ఇక ప్రత్యేకరైళ్లలోనూ రద్దీ ఏ మాత్రం ఉండటం లేదు. అనేక బోగీలు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.
రాతమారిన రాయనపాడు
రాయనపాడు (విజయవాడరూరల్):
కృష్ణాపుష్కరాల సందర్భంగా రాయనపాడులో ఏర్పాటు చేసిన శాటిలైటు రైల్వేస్టేషన్‌లో వివిధ ప్రాంతాలనుంచి వెడుతున్న రైళ్ళు ఆగుతున్నాయి. రాజమండ్రి, భద్రాచలం ప్రాంతాలనుంచి పుష్కరాలకు వచ్చే భక్తులకోసం రైల్వేశాఖ ఏర్పాటు చేసిన రైళ్ళు రాయనపాడు రైల్వేస్టేషన్ వచ్చి వెళుతున్నాయి. హైదరాబాదు ఆపై ప్రాంతాలనుంచి వచ్చే రైళ్ళకు కొండపల్లి రైల్వేస్టేషన్‌లో స్టాపు వుండటంతో భక్తులు అక్కడదిగి పవిత్రసంగమం వైపు వెడుతున్నారు. కాగా, శాటిలైటు రైల్వేస్టేషన్ ఏర్పాటు వల్ల రాయనపాడులో 17 ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగివెడుతున్నాయి. ఆదివారం హూరా–హైదరాబాదు, తిరువంతపురం–ఢిల్లీ కేరళ ఎక్స్‌ప్రెస్, కృష్ణా ఎక్ష్‌ప్రెస్ దూరప్రయాణం చేసే రైళ్ళు ఆగాయి. 200 కిలోమీటర్ల పైబడి దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణకులకు మూడు రోజుల ముందుగా రిజర్వేషన్ టిక్కెట్లబుక్కింగ్ సదుపాయాలను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది.
Advertisement
Advertisement