తిరుమలలో అదనపు లడ్డూల కొరత
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తులకు అదనపు లడ్డూల కొరత ఏర్పడింది. పెరటాశి నెల కావడంతో శ్రీవారి దర్శనం కోసం వారం రోజులుగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అందుకు తగ్గట్టుగా ఆలయంలో లడ్డూలు తయారీ కావడం లేదు. కేవలం సర్వదర్శనం, కాలిబాట భక్తులు, టికెట్లపై వచ్చే భక్తులకు మాత్రం లడ్డూల కొరత లేకుండా కేటాయిస్తున్నారు. ఆలయం వెలుపల మంజూరు చేసే అదనపు లడ్డూలు రోజూ కేవలం 15వేలు మాత్రమే కేటాయించి, తర్వాత కౌంటర్లు మూసివేస్తున్నారు.
అదనపు లడ్డూలు కావాల్సిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన భక్తుల రద్దీ కారణంగా ఆలయం వెలుపల ఉండే అదనపు లడ్డూ కౌంటర్లు మూసివేస్తున్నామని ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తెలిపారు. రద్దీ కారణంగా అదనపు లడ్డూలు ఇవ్వలేమని, రద్దీ తగ్గిన తర్వాత యధావిధిగా కౌంటర్లు తెరుస్తామన్నారు.