
‘వసతి’ ఘోరం
- బూత్ బంగ్లాను తలపిస్తున్న హాస్టల్ భవనం
- నాణ్యత లేని భోజనం.. స్వచ్ఛత లేని నీరు
- ఇబ్బందుల్లో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు
హిందూపురం అర్బన్: హిందూపురం మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందుల మధ్య విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. తమ కష్టాలు ఎవరితో చెప్పుకోవాలని ఆవేదన చెందుతున్నారు. కళాశాలలో సుమారు 250 మందికి పైగా విద్యార్థినులు డీఫార్మసీ, పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరారు. కళాశాలలో ప్రవేశం కోసం రూ.4,500 చెల్లించి ప్రతినెలా మెస్ చార్జీల పేరిట రూ.1,400 కళాశాల యాజమాన్యానికి చెల్లిస్తున్నారు. అయితే కళాశాల ప్రాంగణమంతా పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి విషపురుగులకు ఆవాసంగా మారుతోందని విద్యార్థులు భయపడిపోతున్నారు.
నాణ్యత లేని ఆహారం
హాస్టల్‌లో విద్యార్థినులకు ముద్ద అన్నం, నీళ్ల చారు, కూరగాయలు లేని పప్పు, నీళ్ల వంటి మజ్జిగ అందిస్తున్నారు. ఉదయం పూట టిఫెన్ ఉప్మా, పొంగల్ పచ్చళ్లతో తినాల్సి వస్తోంది. రాత్రిపూట కూడా ఇంతే పరిస్థితి అని విద్యార్థులు వాపోతున్నారు. తీపి పదార్థాలు, మాంసాహారం అనేది మచ్చుకైనా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటకానికి కుళ్లిపోయిన టమాట, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వాడుతుంటారు. తాగునీటిని నాలుగు రోజులకోసారి ట్యాంకర్ ద్వారా తెప్పించి సంప్‌లో వేయిస్తారు.
దుర్గంధానికి కేరాఫ్
పాత భవనాలు కావడంతో బూజు పట్టి అపరిశుభ్రంగా ఉంటున్నాయి. గదుల గోడలపై పిచ్చి రాతలు రాశారు. అసభ్యకరమైన బొమ్మలు వేసి ఉండటంతో విద్యార్థినులు అసహనంతో ఆ గదుల్లోనే ఉండాల్సి వస్తోంది. దీనికి తోడు బాత్ రూంలు దుర్వాసనతో నిండి ఉన్నాయి. మరుగుదొడ్లకు తలుపులు కూడా ఉండవు. నీటికొరత కారణంగా బట్టలు ఇళ్లకు తీసుకెళ్లి శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి. కొత్త హాçస్టల్ భవనాన్ని గతేడాది ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించినా ఇంతవరకు వినియోగంలోకి తీసుకురాలేదు.
ప్రిన్సిపాల్‌కు చెప్పినా ప్రయోజనం లేదు : పవిత్ర, పాలిటెక్నిక్ ఫైనలియర్
హాస్టల్‌లో సమస్యలపై ప్రిన్సిపాల్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. గదుల్లో ఉండలేమని చెబితే టీసీ ఇస్తాం ఇంటికి వెళ్లిపోండి అని బెదిరిస్తున్నారు. గత్యంతరం లేక ఉంటున్నాం.
ఆకతాయిలు రాళ్లు వేస్తున్నారు : దీపిక, పాలిటెక్నిక్
హాస్టల్ గదులల్లో సరైన విద్యుత్ సదుపాయాలు ఉండటం లేదు. చీకటి పడితే ఆకతాయిలు రోడ్డుపక్కన నుంచి రాళ్లు వేస్తుంటారు. విజిల్స్ వేస్తారు. చాలా భయంగా ఉంటుంది. ఉదయాన్నే ఒక విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. దీనిపై యాజమాన్యం స్పందించడం లేదు.