పాఠశాలల్లో ప్రత్యేక సదుపాయాలు
నూరు శాతం టాయిలెట్లు ఏర్పాటు
9.74 లక్షల మంది కౌమార బాలికలకు ‘స్వేచ్ఛ’ ప్యాడ్స్ పంపిణీ
రక్తహీనత నివారణకు వైద్య పరీక్షలు, మాత్రల పంపిణీ
అమ్మ ఒడి ఊతం.. కమ్మటి భోజనం
పాఠశాలల్లో పెరిగిన బాలికల సంఖ్య
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాల అంటే బాలికలకు గతంలో ఓ నరకం.. చదువుకుందామని ఆశ ఉన్నా సదుపాయాలు ఉండేవి కావు. కనీసం టాయిలెట్ కూడా లేని దుస్థితి. కౌమార దశ బాలికల పరిస్థితి మరీ దారుణం. దాంతో చాలామంది 8 లేదా 9 తరగతిలోనే చదువు మానేసేవారు. అత్యధిక బాలికల డ్రాప్ అవుట్స్ కూడా ఈ తరగతుల్లోనే ఉండేవి. ఈ సమస్యను గుర్తించిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బాలికలు చదువుల ఆకాంక్షను నెరవేర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించింది.
ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను నాడు–నేడు ప్రాజెక్టులో 100 శాతం నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు ప్రత్యేక గదిని అందుబాటులోకి తెచ్చింది. స్కూలు స్థాయిలోనే వారి ఆరోగ్యంపైనా దృష్టిపెట్టి, రక్తహీనత ఉన్న బాలికలకు ఫోలిక్ ఐరన్ మాత్రలను అందిస్తోంది. ఏటా కౌమర దశ బాలికలు 9.74 లక్షల మందికి ‘స్వేచ్ఛ’ పేరిట శానిటరీ న్యాప్‌కిన్స్‌ను ఇస్తోంది.
ఈ తరహా సేవలు నూరుశాతం అందిస్తున్న రాష్ట్రాల్లో దేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఫలితంగా గత నాలుగేళ్లుగా బడుల్లో బాలికల సంఖ్య పెరిగింది. ఉత్తీర్ణతలోనూ వారు ముందున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్స్ సాధనలోనూ బాలురు కంటే బాలికలే ముందున్నారు.
బాలికలకు నూరు శాతం సదుపాయాలు
పాఠశాల స్థాయిలో డ్రాప్ అవుట్స్‌కు ప్రధాన కారణం టాయిలెట్లు, గతంలో పట్టణాల్లోని కొన్ని ప్రభుత్వ బడుల్లో మాత్రమే అరకొరగా ఉండేవి. దాంతా విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు చాలా ఇబ్బంది పడేవారు. టాయిలెట్ల సదుపాయం లేని చోట్ల కౌమర బాలికలు తమ చదువుకు స్వస్తి పలికేవారు. రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు–నేడు ప్రాజెక్టు ప్రారంభించి ప్రతి పాఠశాల, జూనియర్ కళాశాలలోను టాయిలెట్ల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం 49,293 ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో నీటి సరఫరాతో టాయిలెట్లు అందుబాటులోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.
45,137 పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక గది, టాయిలెట్లు ఉన్నట్టు ప్రకటించింది. ఫలితంగా బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గిపోవడమే గాక చేరికలు పెరిగాయి. 2018–19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో బాలికల సంఖ్య 18,80,591 మంది ఉంటే 2023–24లో 19,26,724 మందికి పెరిగింది. డ్రాప్ అవుట్స్ కూడా 2018–19లో 16.37 శాతం నుంచి 2023–24 నాటికి 12 శాతానికి తగ్గిపోయింది. దీంతో పాటు బాలికల గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది.
‘స్వేచ్ఛ’గా చదువుకునేలా..
దేశంలో 23 శాతం బాలికలు రుతుక్రమ సమయంలో పాఠశాలలు, కళాశాలలకు దూరంగా ఉంటున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉండేది, పాఠశాల స్థాయిలో అధిక డ్రాప్ అవుట్స్‌కు ఇదే కారణంగా ఉండేది. బాలికల డ్రాప్ అవుట్స్‌కు కారణమవుతున్న రుతుక్రమ ఇబ్బందులను పరిష్కరించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏడు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తోంది. ఏడాదికి 12 కోట్ల ప్యాడ్స్‌ను బాలికలకు ఉచితంగా అందిస్తున్నారు. 10,144 పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని 9,74,121 మంది కౌమార బాలికలకు వీటిని అందిస్తోంది. ఇప్పుడు బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గాయి. చదువుపై దృష్టి పెట్టడంతో ఫలితాల సాధనలోనూ బాలురను మించిపోయారు.
అమ్మఒడి .. జగనన్న గోరుముద్ద
చిన్నారుల చదువుకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సీఎం జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం అమ్మ ఒడి. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా రూ.15 వేలు క్రమం తప్పకుండా ప్రభుత్వం అందజేస్తోంది. దీనివల్ల విద్యార్థుల హాజరు గణనీయంగా పెరిగింది. దీనికి తోడు రోజుకొక మెనూతో మధ్యాహ్న భోజనం చక్కగా అమలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment