నకిలీ లేబుళ్ల గుట్టురట్టు
నకిలీ లేబుళ్ల గుట్టురట్టు
Published Sat, Apr 1 2017 9:50 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
– ఎంఆర్‌పీ కన్నా అధిక వసూళ్లు
– ముగ్గురు నిందితులు రిమాండ్‌కు తరలింపు
ఎమ్మిగనూరురూరల్: గుట్టు చప్పుడు కాకుండా తయారు చేస్తున్న నకిలీ లేబుళ్ల గుట్టు రట్టయ్యింది. కొంద మంది ఆర్‌ఎంపీలు కలసి డబ్బు కోసం లేబుళ్లు తయారు చేస్తూ చివరకు పోలీసుల వలలో చిక్కుకున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తతంగమంతా ఎమ్మిగనూరు పట్టణంలో చోటుచేసుకోవటంతో కలకలం రేపింది. శనివారం సాయంత్రం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ జీ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు...పట్టణంలోని మిలటరీ కాలనీకి చెందిన నాగేష్ అనే వ్యక్తి ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. గుడేకల్‌కు చెందిన మరో ఆర్‌ఎంపీ గురుస్వామితో నకిలీ లేబుళ్ల తయారీకి పన్నాగం పన్నారు.
మూడు నెలలుగా వీటిని ఎమ్మిగనూరు పట్టణం ద్వారకమాయి ఫ్లెక్సీ షాప్‌లో తయారు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. జెంటామైసిన్ అనే టైఫాయిడ్ ఇంజక్షన్ సంబంధించిన లేబుల్స్‌ను తారుమారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ లేబుళ్లతో తయారు చేసిన మందు సీసాలను గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మెడికల్ షాప్‌లో జెంటామైసిన్ సీసాపై ఎంఆర్‌పీ ధర రూ. 6 కాగా, నిందితులు దీనిపై ఉన్న లేబుల్‌ను తొలగించి నకిలీ లేబుల్‌ను అతికిస్తున్నారు. వీరు తయారు చేసిన లేబుల్‌పై ఇంజక‌్షన్ ఖరీదు రూ.100 నుంచి రూ.300 వరకు నిర్ణయించారు.
ఇలా నకిలీ లేబుల్స్ అతికించిన సీసాలను ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ..గుట్టు రట్టు చేశారు. నాగేష్ ఇంట్లో 110 ఖాళీ సీసాలు, ప్రింట్ చేసిన నకిలీ లేబుల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఆదోని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ దాదా ఖలందర్‌కు అప్పగించారు. ఆర్‌ఎంపీలు నాగేష్, గురుస్వామి, ద్వారాకమాయి ఫ్లెక్సీ షాప్‌కు చెందిన సురేష్ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు. గ్రామీణ ప్రజలు.. ఆర్‌ఎంపీల దగ్గర ఇంజక‌్షణ్లు వేయించుకోకుండా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలని తెలిపారు. కేసును ఛేదించిన పట్టణ, రూరల్ ఎస్‌ఐలు హరిప్రసాద్, వేణుగోపాల్‌లను సీఐ అభినందించారు.
Advertisement