తెంపింది ఒకరు... పట్టుబడింది మరొకరు
రాజాం: పట్టణంలోని గాంధీ వీధిలో ఓ చిన్నారి మెడలో చైన్ తెంపేసి పరారైన దొంగ తప్పించుకోగా, మరో వ్యక్తిని స్థానికులు దొంగ అనుకొని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజాంలో శుక్రవారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... స్థానిక గాంధీ వీధిలో హర్షిణి అనే చిన్నారి తోటి స్నేహితులతో ఆడుకుంటుంది. ఇంతలో నీలం రంగు షర్టు వేసుకొని వచ్చిన అగంతుకుడు ఆ చిన్నారిని ముద్దులాడినట్టు నటించి మెడలో ఉన్న చైన్ తెంపేసి పారిపోయాడు.
ఇది గుర్తించిన స్థానికులు వెంబడించగా ఆ దొంగ మెయిన్‌రోడ్డులోని జనాల్లో కలిసిపోయాడు. ఇది గమనించని స్థానికులు అక్కడే తిరుగాడుతున్న గొల్లవీధికి చెందిన కోడిబోయిన శ్రీను అనే మరో వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తాను కాదని మొర్రోమన్నప్పటికీ స్థానికుల ఒత్తిడితో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శ్రీను గతంలో చిల్లర దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ముద్రపడడంతో వారి అనుమానం మరింత బలపడింది.
దొంగ దొరికాడని తెలుసుకున్న చిన్నారి అమ్మమ్మ పైడమ్మ తన కాలనీవాసులతో స్టేషన్‌కు వెళ్లి దొంగను పరిశీలించింది. చైన్ తెంపింది ఇతడు కాదని తేల్చింది. అయినప్పటికీ చైన్ కూడా రోల్డ్ గోల్డ్‌దని చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో చేసేదేమీలేక పోలీసులు శ్రీనును విడిచిపెట్టేశారు. అసలు దొంగను వెతకడంలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా చైన్ తెంపినప్పుడు చిన్నారి మెడకు చిన్నపాటి గాయమైంది. స్థానికులు ఆమెను వైద్యసేవలకు తరలించారు.