దొంగకు దేహశుద్ధి
Published Wed, Dec 28 2016 10:30 PM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM
– పోలీసులకు పట్టించిన కాలనీ ప్రజలు
కర్నూలు : కిరాణ దుకాణంలో ఉన్న మహిళ మెడలో గొలుసు చోరీకి పాల్పడిన దొంగకు కాలనీ ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని అమ్మహాస్పిటల్ – రవీంద్ర స్కూల్ దగ్గర సుబ్బయ్య కిరాణం అంగడి నిర్వహిస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఆయన భార్య అంగట్లో కూర్చొని ఉండగా, కర్నూలు కొత్తపేటకు చెందిన పాత నేరస్తుడు భరత్ సరుకుల కొనుగోలు పేరుతో దుకాణంలోకి వెళ్లి గొలుసు చోరీకి విఫలయత్నం చేశాడు. అది గమనించిన సుబ్బయ్య అడ్డుపోవడంతో కత్తితో మెడపైన, కాలిపై పొడిచి గాయపరిచాడు. అంగట్లో జరుగుతున్న పెనుగులాటను ఇరుగుపొరుగు వారు చూసి పరుగెత్తుకుంటూ వచ్చి దొంగను పట్టుకొని దేహశుద్ధి చేశారు. వెంటనే క్యూఆర్‌టీకి సమాచారం అందించగా, మూడో పట్టణ ఎస్‌ఐ మల్లికార్జున అక్కడికి చేరుకొని దొంగను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఇతను గతంలో కూడా చోరీలకు పాల్పడి రెండుసార్లు జైలు జీవితం గడిపాడు. ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చి మళ్లీ చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. కిరాణ దుకాణం నిర్వాహకుడు సుబ్బయ్యను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మూడవ పట్టణ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Advertisement
Advertisement