పొలం కాపలాకు వెళ్లిన రైతును గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని శభాష్‌పల్లి వ్యవసాయ పొలం వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
శివ్వంపేట, న్యూస్‌లైన్ : పొలం కాపలాకు వెళ్లిన రైతును గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని శభాష్‌పల్లి వ్యవసాయ పొలం వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నిమ్మల సాయిలు (58) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతుడి భార్య జయమ్మ తొమ్మిదేళ్ల క్రితం మృతిచెందగా వీరికి మురళీ, గణేష్, నాగేష్ అనే కుమారులున్నారు. వీరు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. సోదరి కైతమ్మ వద్ద మృతుడు ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. శుక్రవారం రాత్రి పొలం వద్దకు వెళ్లిన రైతు సాయిలు పశువుల పాక వద్ద నిద్రపోయాడు.
అయితే పొద్దుపోయిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు సాయిలు మొహంపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. హత్యకు ఉపయోగించిన బండరాయిని సమీప పొలాల వద్ద పడేశారు. శనివారం ఉదయం అటుగా వెళ్లిన సమీప పొలాల రైతులు ఈ విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని తూప్రాన్ సీఐ సంజయ్, ఎస్‌ఐ రాజేష్‌నాయక్‌లు పరిశీలించారు. సాయిలుని హత్య చేసింది సోదరుడి బావమరిది నాగభూషణమేనని గ్రామస్తులు, బంధువులు ఆరోపించారు. హత్య చేసిన వారిని అరెస్టు చేసేంత వరకు మృతదేహాన్ని తీసేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. పోలీసులు కల్పించుకుని హత్యకు పాల్పడిన వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడి కుమారుడు మురళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు.