అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలపరిధిలోని అరికెర గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
అప్పులబాధ తాళలేక ..
Published Thu, Nov 17 2016 12:41 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– చెట్టుకు ఉరివేసుకొని రైతు ఆత్మహత్య
అరికెర(ఆలూరు రూరల్): అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలపరిధిలోని అరికెర గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన హనుమంతప్ప , తిమ్మక్కలకు ఐదుగురు కుమారులు. వారిలో మొదటి కుమారుడు రాముడు (36) తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఎకరా భూమిని సాగు చేసుకుంటున్నాడు. గత మూడేళ్లుగా పంటలు సరిగా పండక, పెట్టుబడులకు చేసిన అప్పులు పెరిగిపోయాయి.వాటిని తీర్చేందుకు ఏడాది క్రితం రాముడు సెకండ్‌హ్యాండ్ ట్రాక్టర్‌ను ఫైనాన్స్‌లో కొనుగోలు చేశాడు. ఆ ట్రాక్టర్ కూడా నిత్యం రిపేరీలు రావడం, బాడుగలు సరిగా లేకపోవడంతో దాన్ని తిరిగి ఫైనాన్స్ కంపెనీ వారికే అప్పజెప్పాడు. మరోవైపు పంటల సాగుకు, ట్రాక్టర్ రిపేరీకి చేసిన అప్పులు పెరిగిపోయాయి. దీంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురై బుధవారం పొలానికి వెళ్తునా్ననని భార్య అనసూయమ్మకు చెప్పి హొళగుంద రోడ్డులో లుంగీతో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గొర్రెలకాపరులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించి బోరున విలపించారు. ఆలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతుడు రాముడు వైఎస్‌ఆర్‌సీపీ గ్రామ నాయకుడిగా ఉంటూ గత సర్పంచు ఎన్నికల్లో నాలుగోవార్డు మెంబర్‌గా పోటీచేసి గెలుపొందాడు. రాముడికి ఓ కుమారుడు సంతానం.
– బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
అప్పుల బాధతో మృతిచెందిన రాముడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ ఆలూరు మండల యూత్ అధ్యక్షుడు అరికెర వీరేష్, గ్రామ ఎంపీటీసీ సభ్యులు లక్ష్మన్న, సర్పంచు వెంకటేష్‌నాయక్ తదితరులు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబ సభ్యులను వారు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Advertisement
Advertisement