మండల పరిధిలోని ఈదులపల్లికి చెందిన రైతు కుళ్లాయప్ప(62) ఆత్మహత్య చేసుకున్నారు.
ముదిగుబ్బ (ధర్మవరం) : మండల పరిధిలోని ఈదులపల్లికి చెందిన రైతు కుళ్లాయప్ప(62) ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, బంధువుల కథనం మేరకు.. ఆయన తనకున్న ఆరు ఎకరాల పొలంలో బోరు వేసుకుని రెండు మూడేళ్ల క్రితం నుంచీ అరటి, టమాట లాంటి పంటలు సాగు చేసి నష్టాలు చవిచూశారు. అప్పులయ్యాయి. ఇప్పుడు సాగులో ఉన్న టమాట, వేరుశనగ పంటలు కూడా ఆశాజనకంగా లేవు. దీనికితోడు కుటుంబ సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతుండేవారు.
ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం పొలంలోనే పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను గుర్తించిన కుటుంబీకులు బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. కానీ కోలుకోలేని ఆయన బుధవారం సాయంత్రం మృతి చెందారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు. కుళ్లాయప్పకు భార్య నరసమ్మ, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పిల్లలందరికీ పెళ్లిళ్లయిపోయాయి.