రైతులకు మేం చేసినట్లు ఏ ప్రభుత్వం చేయలేదు..
కడప అగ్రికల్చర్: రైతులకు మేం చేసినట్లు ఏ ప్రభుత్వం చేయలేదు.. వారికి ప్రతి విషయంలోనూ మేలు చేస్తున్నాం... ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు, పశుసంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు. వారు మాట్లాడే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి ఏ మాత్రం పొంతన లేదని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు.పథకాలు అటకెక్కితే వాటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టడమా? లేక వాటినే పునరుద్ధరించడమో చేయాలని, అయితే అటు ప్రభుత్వం, ఇటు మంత్రి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు, కాపరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత రైతులు పశుసంపదను ప్రాణప్రదంగా ప్రేమిస్తారు. అటువంటి పశుసంపదకు ఆపద వస్తే ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమని రైతులు, కాపరులు, యజమానులు అంటున్నారు. పశువులు, గొర్రెలకు బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. రెండేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేయక అటకెక్కించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మేతకోసం బయటకు వెళ్లిన పశువులు, గొర్రెలు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే వరకు యజమానికి, కాపరికి నమ్మకం లేకుండా పోయింది. ఎందుకంటే కరెంటు తీగ తగలడమో..రోడ్డు ప్రమాదంలోనో, విషపదార్థం తనడం వల్లనో మృత్యువాత పడుతున్నాయి.
ఇటీవల ఖాజీపేట, చాపాడు, ముద్దనూరు, తొండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 2500 గొర్రెల దాకా మృత్యువాత పడినట్లు కాపరులు ఆవేదనతో తెలిపారు. రోడ్డుప్రమాదం, సరైన వైద్యం అందకపోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా 1500 పశువులు, పాడి పశువులు మృతి చెందాయి. వీటికి బీమా ఉంటే ప్రమాదం సంభవించిన సమయంలో ఊరటగా నిలిచేది. ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి, ఆర్ధిక ఇబ్బందుల్లో కూరకుపోతున్నారు.
జీవాల బీమాను అటకెక్కించారు.
వ్యవసాయదారులు జీవాల పోషణను వృత్తిగా చేపట్టి జీవనం సాగిస్తున్నారు. మేకలు, గొర్రెలు ఆదాయ వనరుగా ఉన్నాయి. జిల్లాలో గొర్రెలు 15.38 లక్షలు, మేకలు 4.98 లక్షలు ఉన్నాయి. ఇందులో దాదాపు 8.50 లక్షల గొర్రెలకు బీమా చేయించారు. ఇందులో 80 వేల గొర్రెలు చనిపోగా రూ. 2.30 కోట్లు అందజేశారు. మిగతా వారు బీమా చేసుకోవడానికి ముందుకు వస్తున్నా పథకం లేకపోవడంతో మదనపడుతున్నారు.
పశువులు మృత్యువాత పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
పాడి రైతులు నష్టపోకూడనే ఉద్దేశంతో 2008లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పశువుల, గొర్రెల బీమా పథకాలను తీసుకొచ్చారు. 2014–15 వరకు ఈ బీమాను కొనసాగిస్తూ వచ్చారు. 2015 నుంచి ఈ పథకాన్ని అటకెక్కించారు. జిల్లాలో ఆవులు 1.69 లక్షలు, బర్రెలు 5.96 లక్షలు ఉన్నాయి. ఇందులో 72 వేల పశువులకు రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. మిగతా వాటికి బీమా చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పథకం ఎత్తేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో విద్యుత్ తీగలు తగిలి, రోడ్డు ప్రమాదంలోను, ఇతర కారణాల వల్ల దాదాపు 22,261 పశువులు మృతి చెందగా రూ.6.04 కోట్లు రైతులకు బీమా మొత్తాన్ని అందించారు. అయితే రెండేళ్లగా బీమా లేకపోవడంతో పశువులు మృత్యువాత పడుతున్నా రైతులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.