ఉద్యోగంకోసం తండ్రిని చంపిన తనయుడు
ఉద్యోగంకోసం తండ్రిని చంపిన తనయుడు
Published Mon, Dec 19 2016 9:26 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
మాచర్ల : తండ్రి ఉద్యోగం తనకు ఇప్పించడానికి ఒప్పుకోవడం లేదనే ఆగ్రహంతో కుమారుడు తండ్రిని హత్య చేసిన సంఘటన గుంటూరు జిల్లా మాచర్లలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... పట్టణంలోని 23వ వార్డు లింగాపురం కాలనీ మూడవ లైన్లో నివాసం ఉండే కొదమగుండ్ల శ్రీనివాసరావు(47) పట్టణంలోని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు మొదటి భార్య మాధవి పదేళ్ల కిందట మృతి చెందింది. రెండో భార్య భారతి కూడా చనిపోవడంతో మూడేళ్లుగా సైదమ్మ అలియాస్ కుమారి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. మొదటి భార్య కుమారుడైన అమర్‌నాథ్ తన తండ్రి శ్రీనివాసరావుతో ఉద్యోగం విషయంలో తరచుగా గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ సోమవారం తండ్రి ఇంటికి వెళ్లి ఉద్యోగం తనకు ఇప్పించకపోతే ఊరుకోనని ఘర్షణ పడ్డాడు. తన మాట వినడంలేదనే కోపంతో ఆ ప్రాంతంలో ఉన్న బండరాయిని తీసుకుని తండ్రి శ్రీనివాసరావు తలపై మోదాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన చూసిన సైదమ్మ హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాసరావు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అమర్‌నాథ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement