వీవీఐపీ 'బాబు' ల కోసం వంగిన నిబంధనలు | Fault-lines of Andhra Stampede Suggest Rules Bent for VIPs | Sakshi
Sakshi News home page

వీవీఐపీ 'బాబు' ల కోసం వంగిన నిబంధనలు

Published Wed, Jul 15 2015 7:50 PM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

సాధారణ భక్తుల కోసం ఏర్పాటుచేసిన పుష్కరిణిలో కుటుంబ సభ్యులతోకలిసి పుణ్యస్నానం ఆచరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు

సాధారణ భక్తుల కోసం ఏర్పాటుచేసిన పుష్కరిణిలో కుటుంబ సభ్యులతోకలిసి పుణ్యస్నానం ఆచరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్: ఏమంత అర్జెంటు పనుందని అందరికంటే ముందుగా  చంద్రబాబు పుష్కర స్నానం చేశారు? ఏదైనా అధికారిక కార్యక్రమానికి హాజరు కావాల్సిఉందా? లేదా ఇంకేదైన ముఖ్యమైన పనుందా?  పుష్కరాల ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచే రాజమండ్రిలో మకాం వేసిన ఆయన.. పన్నెండు రోజులూ అక్కడే ఉంటానని ప్రకటించారు. అలాంటప్పుడు తీరిక సమయంలోనే భక్తుల రద్దీ తగ్గినప్పుడో.. అదీకాదంటే వీఐపీ ఘాట్ లోనో స్నానం చేస్తే పోయేదికదా? ఇంత మంది చనిపోయేవారు కాదుకదా? అని ఎన్డీటీవీ తన కథనంలో ప్రశ్నించింది. మొత్తం వ్యవహారంలో చంద్రబాబు వీవీఐపీ హోదాలో నిబంధనలను గోదాట్లో కలిపిన తీరును ఎండగట్టింది.

 

'గోదావరి పుష్కరాలు ప్రారంభమైననాడే 29 మంది అమాయకుల (వారిలో 26 మంది మహిళలు) ప్రాణాలు బలిగొన్నపాపం చంద్రబాబుదే..' నిన్నవరకూ భక్తులూ, రాజకీయ పక్షాలూ మాట్లాడిన ఈ వాస్తవాన్నే ఇప్పుడు జాతీయ మీడియా కూడా చెబుతోంది. అంతేకాదు.. వీవీఐపీ హోదాలో బాబు చేసిన ఘోర తప్పిదాలే అనంత విషాదానికి కారణమని ఎన్డీటీవీ ప్రముఖంగా పేర్కొంది.


ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రచారం కల్పించినట్లే రాజమండ్రిలోని ప్రధాన ఘాట్లు అన్నింటివద్దా జనం రద్దీ విపరీతంగా ఉంది. జన సమూహ నిర్వహణ (క్రౌడ్ మేనేజ్మెంట్) నిపుణులు చెప్పినదాన్నిబట్టి మంగళవారం పుష్కర ఘాట్ వద్ద ప్రతి 10 నిమిషాలకు అప్పటికే ఉన్న భక్తులకు తోడు కొత్తగా మరో 10 వేల మంది తోడయ్యారు. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులతో కలిసి పుణ్యస్నానం, పితృదేవతలకు సంతర్పణం తదితర కార్యక్రమాలకు దాదాపు రెండు గంటలపాటు సాగింది..

ఆ సమయంలో భక్తులెవరిని నదిలోకి అనుమతించలేదు. అంటే సీఎం గడిపిన నిమిష నిమిషానికి భక్తుల సంఖ్య అమాంతం పెరుగుతూనేపోయింది. అలా రెండు గంటలపాటు.. దాదాపు లక్షన్నర మంది వన్ వే ట్రాఫిక్ లాగా పోగయ్యారు. పుష్కరిణిలోకి తోసుకురావడం తప్ప మరో దారి లేదక్కడ. బాబు వెళ్లిపోగానే భక్తులను అనుమతించడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు. మంత్రులకు ఇంగితం లేకున్నా అధికారులకైనా సోయి ఉండక్కరలేదా? అనే ప్రశ్నలకు వినిపించే సమాధానం.. 'వీఐపీల కోసం నిబంధనలు సైతనం వంగిపోవాల్సిందే' అని.


రూ.2 వేల కోట్లతో పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేస్తామన్న చంద్రబాబు ప్రకటనలు అవాస్తవాలని, ఘాట్ల వద్ద టాయిలెట్టుగానీ, మెడికల్ క్యాంపులు గానీ, చివరికు గుక్కెడు మంచినీళ్లు కూడా లేకుండాపోయిన వైనాన్ని తెలిపింది. నిపుణులు వివరణను బట్టి.. జన సమూహం కదులుతున్నప్పుడు చదరపు మీటరుకు గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉండేలా చూడటం రక్షణాత్మక చర్యల్లో ప్రధాన అంశం. నిన్న రాజమండ్రి విషాదంలో ఒక చదరపు మీటరుకు కనిష్ఠమే ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. అంటే కనీసం గాలి పీల్చికునే అవకాశంకూడా మృగ్యమైన స్థితన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement