'తొక్కిసలాటప్పుడు నేనక్కడ లేను'
రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిరోజు తొక్కిసలాట జరిగిన సమయంలో తాను రాజమండ్రిలోనే లేనని సినీ దర్శకుడు బోయపాటి శ్రీను వెల్లడించారు. అంతకు ముందురోజు గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొని తాను వెళ్లిపోయానన్నారు. హారతి చూసిన ప్రతి భక్తుడూ సంతోషించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగానే ఆ కార్యక్రమాన్ని తీర్చిదిద్దేందుకు వచ్చానే గాని, షార్ట్ ఫిల్మ్ కోసం కాదని స్పష్టం చేశారు.
వీఐపీ ఘాట్‌లో శుక్రవారం పుష్కర స్నానమాచరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పుష్కరాలకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. ముగింపు రోజు నిత్యహారతి కార్యక్రమాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా చూడాలని ప్రభుత్వం తనను కోరిందన్నారు. ఆ మేరకు హారతిచ్చే రెండు వంతెనలపై అధునాతన లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గోదావరికి అభిముఖంగా ఇస్తున్న నిత్యహారతిపై స్వామిజీలు, ఆధ్యాత్మికవేత్తల నుంచి వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు.