క్లైమాక్స్ డెరైక్షన్ బోయపాటిదే.. | godavari pushkaralu climax directed by boyapati srinu | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్ డెరైక్షన్ బోయపాటిదే..

Published Fri, Jul 24 2015 9:00 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

పుష్కరాల ముగింపు ఉత్సవం ఏర్పాట్లపై డీజీపీతో చర్చిస్తున్న బోయపాటి శ్రీను - Sakshi

పుష్కరాల ముగింపు ఉత్సవం ఏర్పాట్లపై డీజీపీతో చర్చిస్తున్న బోయపాటి శ్రీను

సాక్షి, రాజమండ్రి: గోదావరి పుష్కరాల ముగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. యోగా గురువు బాబా రాందేవ్‌తోపాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వందలాది ప్రముఖులు పాల్గొననున్న ముగింపు ఉత్సవం కోసం సర్కారు రూ.కోట్లు ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు.

గోదావరి నిత్యహారతి, పుష్కరాల ప్రారంభంపై డాక్యుమెంటరీ నిర్మాణ బాధ్యతలు నిర్వహించిన ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకే ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు గోదావరి తీరం, ఆర్ట్స్ కళాశాలల్లో జరిగే ముగింపు వేడుకలకు సభావేదికల రూపకల్పన కార్యక్రమాల డిజైన్ అంతా దగ్గరుండి చూసుకునేందుకు ఆయన గురువారం రాజమండ్రి చేరుకున్నారు.

ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే విషయమై రాష్ట్ర డీజీపీ, ఇతర అధికారులతో సమాలోచనలు  జరిపారు. 25న రాత్రి నిత్యహారతిని నభూతో నభవిష్యతి అనే రీతిలో నిర్వహించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఇరు వంతెనల నుంచి భారీ ఫోకస్ లైట్లు ఏర్పాటు చేసి ఆ వెలుగులతో నదీజలాలు సప్తవర్ణశోభితంగా కన్పించేలా తీర్చిదిద్దడంతోపాటు హారతి సమయంలో క–{తిమ పొగ(స్మోక్) పంట్లు చుట్టూ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

హారతి ఇచ్చే వేళల్లో పురోహితులు వేదమంత్రోచ్ఛరణలకు భక్తులు తన్మయత్వం పొందేలా శ్రావ్యమైన సంగీతం స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టమ్‌ను సిద్ధం చేస్తున్నారు. మరొకవైపు ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే ముగింపు వేడుకల్లో భారీతనం ఉట్టిపడే రీతిలో సినిమా సెట్టింగ్‌లో వేదికను తీర్చిదిద్దడంతోపాటు సినీ కళాకారులు, గాయకులతో సంగీత విభావరి, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. చివరగా వెయ్యి మంది కూచిపూడి నృత్య కళాకారులు ఒకేసారి నృత్యప్రదర్శన ఇచ్చేలా వేదికను, సౌండ్ సిస్టమ్‌ను తీర్చిదిద్దే బాధ్యతను బోయపాటికి అప్పగించారు.

పుష్కరాల ప్రారంభంరోజైన 14న ఉదయం సీఎం చంద్రబాబు పుష్కరఘాట్‌లో సుమారు రెండున్నర గంటల పాటు ఉండిపోవడం బోయపాటి తీసే డాక్యుమెంటరీ చిత్రం కోసమేననే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోవడానికి సీఎంతోపాటు, బోయపాటి కూడా కారణమని విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ముగింపు ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను కూడా తిరిగి బోయపాటి చేతుల్లోనే పెట్టడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement