బోయపాటి వస్తారు.. ఏర్పాట్లు చూస్తారు
- రాజమండ్రి ఘటన తప్పు తనమీదే వేసుకుంటానని సీఎం చెప్పారు
- రాజమండ్రి ఎంపీ మురళీమోహన్
గోష్పాద క్షేత్రం (కొవ్వూరు) : దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ వచ్చి గోదావరి హారతి, ముగింపు ఏర్పాట్లు సంబంధించి మిగిలిన పనులన్నీ చేస్తారని రాజమండ్రి ఎంపీ ఎం.మురళీమోహన్ చెప్పారు. బుధవారం ఆయన కొవ్వూరులో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25న పుష్కరాలు ముగింపు సందర్భంగా అద్భుతమైన బాణసంచా కాల్పులు ఏర్పాటు చేశామని, ఇవి సుమారు 8 నిమిషాలపాటు ఉంటాయని తెలిపారు. గోదావరి హారతికి కొత్త ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనికోసం బోయపాటి శ్రీనివాస్ గురువారం ఉదయం రాజమండ్రి రానున్నారని వెల్లడించారు. మూడు రోజులపాటు మిగిలిన అన్ని పనులూ ఆయన పూర్తిచేస్తారని చెప్పారు.
ముగింపు ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిని వదిలి ఇన్ని రోజులు ఎప్పుడూ లేరని, హుదూద్ తుపాను నేపథ్యంలో 8 రోజులు మాత్రమే విశాఖలో ఉన్నారని చెప్పారు. కానీ.. పుష్కరాలకు మాత్రం 14 రోజులు ఇక్కడే ఉన్నారని అన్నారు. పుష్కరాల్లో కష్టపడి పనిచేసిన వారందరినీ ఈనెల 26న సీఎం సత్కరిస్తారని చెప్పారు.
తప్పు తనమీదే వేసుకుంటానని బాబు అన్నారు
పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రిలో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమని, అది మాయని మచ్చలా ఉండిపోతుందని మురళీమోహన్ వ్యాఖ్యానించారు. ఆ ఘటన అనూహ్యంగా జరిగిపోయిందన్నారు. ముఖ్యమంత్రి మొదటిసారిగా కన్నీళ్లు పెట్టుకోవడం ఆ రోజు తాను చూశానని తెలిపారు.
ప్రజలకు మొహం ఎలా చూపించాలో అని సిగ్గుపడ్డామని, భయపడ్డామని అన్నారు. అయినా ధైర్యం చేసి ఘటన తరువాత రేవులోకి వెళ్లామన్నారు. చివరకు అందరూ క్షమించారని, ఇది దురదృష్టకరమని ప్రజలే అన్నారని మురళీమోహన్ పేర్కొన్నారు. ఈ ఘటన పోలీసు వైఫల్యం, కలెక్టర్ వైఫల్యం, తహసిల్దార్ వైఫల్యం కారణమని అననని, తప్పు తనమీదే వేసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారని మురళీమోహన్ చెప్పారు.