'ఏ హోదాతో బోయపాటి మైక్ పట్టుకున్నారు'
హైదరాబాద్ : గోదావరి పుష్కరాల నేపథ్యలో రాజమండ్రిలో తొక్కిసలాట ఘటనపై హైకోర్టును ఆశ్రయిస్తామని అమలాపురం మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ లో శ్రీరాజ్ విలేకర్లతో మాట్లాడుతూ... రాజమండ్రిలో తొక్కిసలాట హర్షకుమార్ వర్గం కుట్ర అని మంత్రుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
తోక్కిసలాట ఘటనపై కమిటీ వేసి సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని శ్రీరాజ్ డిమాండ్ చేశారు. సెంట్రల్ జైల్లో ఉండి కనీసం ఫోన్ కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్న తన తండ్రిపై అబాండాలు వేయడం సరికాదన్నారు. తోక్కిసలాట సంఘటనతో కలత చెంది పట్టణ మూడో టౌన్ పీఎస్కు వెళ్తే దాదాపు 2 గంటలు వేచి ఉంచి ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పుష్కరాల సమయంలో మైక్ ఐ అండ్ పీఆర్ లేదా పోలీసుల చేతిలో ఉండాలి. కానీ దర్శకుడు బోయపాటి శ్రీను మైక్ పట్టుకున్న దృశ్యాలు అన్నిఛానల్స్లో చూశామన్నారు. ఏ హోదాతో బోయపాటి మైక్ పట్టుకున్నారని ప్రశ్నించారు. తన తండ్రి హర్షకుమార్ను అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదన్నారు. దీక్ష చేస్తున్న 36 గంటల్లో కనీసం డాక్టర్ను కూడా పంపకుండా నిర్ధాక్షణ్యంగా ఈడ్చుకెళ్లారని శ్రీరాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి అడ్మినిస్ట్రేటీవ్ స్కిల్స్ లేవని ఎద్దేవా చేశారు.