తీరంలో సమరం
తీరంలో సమరం
Published Fri, Jan 6 2017 11:13 PM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM
నరసాపురం : భవిష్యత్ తరాల ఉనికిని ప్రశ్నార్థకం చేసే గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన రెండు రోజుల రిలే నిరాహారదీక్షలు పూర్తిస్థాయిలో విజయవంతమయ్యాయి. రెండో రోజు శుక్రవారం కూడా అదే స్ఫూర్తితో ప్రజలు రణనినాదం చేశారు. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, వీరవాసరం, మొగల్తూరు మండలాల్లోని 40 గ్రామాల ప్రజలు దీక్షల్లో కూర్చున్నారు. మహిళలు, పిల్లలు అని తేడా లేకుండా ఇళ్లు వదిలి, బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రజల పోరాటానికి వెన్నుదన్నుగా మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో రెండోరోజు కూడా భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ సాగింది. దీంతో తీరప్రాంతంలో సమరభేరి మోగింది. వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర తదితర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. దీక్షా శిబిరాలను సందర్శిస్తూ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తుది వరకూ పోరాడతామని చెప్పారు.
భారీ ర్యాలీగా..
నరసాపురం మండలం కొప్పర్రు గ్రామానికి ముదునూరి ప్రసాదరాజు భారీ మోటార్‌సైకిల్ ర్యాలీతో వచ్చారు. సీపీఎం, మెగాఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, తుందుర్రు బాధిత గ్రామాల రైతులు, మత్స్యకారులు, ప్రజలు కూడా కొప్పర్రుకు స్వచ్ఛందంగా చేరుకున్నారు. రొయ్యల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినదిస్తూ అక్కడి నుంచి ర్యాలీ సాగింది. మొగల్తూరు మండలం శేరేపాలెం, కొత్తపాలెం, మొగల్తూరు, ముత్యాలపల్లి, కొత్తోట, కోమటితిప్ప, జగన్నాథపురం, కాళీపట్నం తూర్పు, కాళీపట్నం పడమర పంచాయతీల మీదుగా ర్యాలీ సాగింది. మార్గమధ్యలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాలను సందర్శించి నాయకులు మాట్లాడారు.
సింగపూర్, జపాన్‌లో ఇలాగే జరుగుతుందా : వంక రవీంద్ర
తెల్లారితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్, జపాన్ అంటూ పాఠాలు చెప్తారు కదా? మరి ఆ దేశాల్లో కాలుష్యకారకమైన పరిశ్రమలు ప్రజల ఆమోదం లేకుండా దౌర్జన్యంగా ఏర్పాటు చేస్తున్నారా? చెప్పాలని వంక రవీంద్ర డిమాండ్ చేశారు. కోమటితిప్పలో దీక్షలో కూర్చున్న ఉద్యమకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజలు వ్యతిరేకించే ఫ్యాక్టరీలను బలవంతంగా కట్టే సంస్కృతి ఒక్క చంద్రబాబు వద్దే ఉందన్నారు. అభివృద్ధి పేరుతో రైతుల భూములు లాక్కోవడం, కమీషన్‌ల కోసం రోజుకో కొత్త ప్రాజెక్ట్‌ను తెరమీదకు తీసుకురావడం చేస్తున్నారని విమర్శించారు.పారిశ్రామికీకరణపై ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించాలని డిమాండ్ చేశారు.
ఉద్యమం చరిత్రలో నిలుస్తుంది : ముదునూరి
మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఒక సమస్యపై 40 గ్రామాల ప్రజలు కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఒక్కసారిగా రోడ్డెక్కి న్యాయపోరాటం చేయడం సామాన్య విషయం కాదన్నారు.ఈ ఉద్యమం జిల్లా చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. తుందుర్రు ఆక్వాపార్కు కారణంగా రైతులు పంటలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా గొంతేరు డ్రెయిన్‌పై ఆధారపడి తరతరాలుగా జీవిస్తున్న మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పారు. ముఖ్యమంత్రి మొండిగా ముందుకెళ్లడం, స్థానిక ఎమ్మెల్యేలు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మాట్లాడటం దారుణమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ మాట్లాడుతూ పోలీస్ నిర్భం«ధాలు, ప్రభుత్వ దౌర్జన్యాలకు తలొగ్గే ప్రసక్తి లేదన్నారు. ఫ్యాక్టరీ వద్దని ఎవరూ చెప్పడంలేదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సముద్ర తీరప్రాంతానికి తరలించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుణ్ణం నాగబాబు, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడీ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బర్రి శంకరం, మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ సాయినా«థ్ ప్రసాద్, సీపీఎం నేతలు కవురు పెద్దిరాజు, జేఎన్‌వీ గోపాలన్, ఐద్వా డివిజన్ కార్యదర్శి పి.పూర్ణ తదితరులు మాట్లాడారు.
Advertisement
Advertisement