- కోట్లాది రూపాయల బిల్లులపై నేరుగా రిజిస్ట్రార్ ఆమోదం
జేఎన్‌టీయూ:
వర్సిటీలో ఫైనాన్స్ ఆఫీసర్ పదవి చాలా కీలకం. ఆర్థికపరమైన అంశాలకు చేదోడువాదోడుగా ఉండడంతో పాటు బిల్లులకు జవాబుదారీతనం ఉండాల్సిన ప్రాధాన్యం గల పోస్టు. జేఎన్‌టీయూ (ఏ) ఏర్పడి ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఫైనాన్స్ ఆఫీసర్ నియామకం చేపట్టకుండానే పాలనా వ్యవహారాలు నిర్వహిస్తుండడం గమనార్హం.
భర్తీ చేయాలంటూ ఆదేశాలు ..
రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఫైనాన్స్ అధికారిని భర్తీ చేసేంతవరకు వర్సిటీ పరిధిలోని ఎవరైనా డిప్యూటీ రిజిస్ట్రార్‌ను నియామకం చేయాలని ఉన్నత విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయినా వర్సిటీ అధికారవర్గాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జేఎన్‌టీయూ ప్రతి నెలా రూ.3.45 కోట్లు బోధన, బోధనేతర, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోంది. మరో వైపు కోట్లాది రూపాయలు సివిల్ వర్కులు చేస్తున్నారు. పరీక్షల విభాగం ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపులకు, ఆర్థిక వ్యవహారాలకు జవాబుదారీతనం , పారదర్శకత పెంపొందించాల్సి ఉంది. 8 సంవత్సరాలుగా ఫైనాన్స్ ఆఫీసర్‌ను నియామకం చేయకుండా రిజిస్ట్రార్ ఆర్థిక అధికారిగా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఫైనాన్స్ ఆఫీసర్ నియామకం అనివార్యం. సాధారణంగా ఫైనాన్స్ ఆఫీసర్‌ను గ్రూప్–1 స్థాయి అధికారి లేదా అంతకంటే ఉన్నత స్థాయి గల వారిని డెప్యుటేషన్ మీద కాని, నేరుగా రాష్ట్ర ప్రభుత్వ నియమించాల్సి ఉంది.
అయ్యవార్లకు ఆర్థిక లావాదేవీలు ఎలా తెలుస్తాయి? :
జేఎన్‌టీయూలో ప్రొఫెసర్ స్థాయి ఉన్నవారిని రిజిస్ట్రార్‌గా నియమిస్తున్నారు. పాలనాపరమైన విషయాలు ప్రొఫెసర్‌లకు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ కోట్లాది రూపాయలు ఆర్థికలావాదేవీలు, ఖాతాలు సక్రమంగా ఉన్నాయా? లేవా? అనే అంశం ప్రొఫెసర్‌లకు ఎలా తెలుస్తాయి? ఇందులో నిపుణులైన వారే ఆర్థిక లావాదేవీలపై పూర్తి అవగాహన ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఎస్కేయూలో 2014 నవంబర్ 11న రూ.3.07 కోట్ల జీతాలు అకౌంట్స్ విభాగంలో పనిచేసిన ముగ్గురు ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల బినామీ ఖాతాల్లోకి మళ్లించారు. ఇలాంటి ఆర్థికపరమైన తప్పిదాలు, క్రమశిక్షణతో కూడిన ఖాతాల నిర్వహణ ఉండాలంటే సుశిక్షితులైన , నిపుణులైన ఫైనాన్స్ ఆఫీసర్‌ను నియమించాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫైనాన్స్ ఆఫీసర్‌ను నియమించాలనే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.