వెల్దుర్తి: ఉపాధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లకు రూ. 20, 576 వేల జరిమానాలు విధించారు. మండలంలో గత ఏడాది జరిగిన ఉపాధి పనులపై పది రోజులుగా గ్రామగ్రామాన ఆడిట్ నిర్వహించారు. ఈ నివేదికలపై బుధవారం ఉదయం నుండి రాత్రి రెండు గంటల వరకు ఎంపీపీ కార్యాలయంలో ప్రజా దర్భార్ నిర్వహించారు. ఈ కార్య క్రమానికి జిల్లా విజిలెన్స్ అధికారి శివయ్య, ప్రొసీడింగ్ అధికారిణి వసంత సుగుణలు హాజరయ్యారు.
ఆయా గ్రామాల్లో టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యం వహించడం వల్ల మేట్‌లు మస్టర్ రోల్‌లలో పనులు చేసిన కూలీలకు హాజరు వేయక, పనులు చేయకున్నా చేసినట్లు హాజరు వేసినట్లు గుర్తించారు. దీంతో అధికారులు ఆగ్రహించి అలాంటి మేట్‌లను తొలగిస్తూ, నిర్లక్ష్యం వహించిన టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఈ జరిమానాలు విధించారు.