సర్వం అగ్గి పాలు | fire accident | Sakshi
Sakshi News home page

సర్వం అగ్గి పాలు

Published Thu, Nov 3 2016 10:50 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

సర్వం అగ్గి పాలు - Sakshi

సర్వం అగ్గి పాలు

  • కొంతమూరులో 11 తాటాకిళ్లు దగ్ధం
  • నిరాశ్రయులుగా 13 కుటుంబాలు
  • రూ.8 లక్షల ఆస్థి నష్టం
  • పొయ్యి వెలిగిస్తుండగా గ్యాస్‌బండ నుంచి మంటలు చెలరేగి..
  • రాజమహేంద్రవరం రూరల్‌:
    రెక్కాడితే గాని డొక్కాడని పేదల బతుకులు బుగ్గయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం, కొంతమూరు గ్రామంలోని కల్యాణనగర్లో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో 11 ఇళ్ల పూర్తిగా దగ్ధమయ్యాయి. మరొక ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంతో 13 కుటుంబాల వారు కట్టుబట్టలతో మిగిలారు. సుమారు రూ.ఎనిమిది లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. ఇక్కడి మొసళ్ల చెరువు గట్టుపై 42 తాటాకిళ్లు వేసుకుని పేదలు జీవిస్తున్నారు.ఉదయం 8.30 గంటల సమయంలో గుల్లా భవానీ అనే గృహిణి టీ కాచేందుకు తన ఇంట్లోని గ్యాస్‌ పొయ్యి వెలిగిస్తుండగా బండ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భవానీ భయంతో అక్కడ నుంచి బయటకు పరుగులు తీసింది. మంటలు కొద్ది నిముషాల్లోనే చుట్టుపక్కల ఉన్న తాటాకిళ్లకు కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే 11 గృహాలు పూర్తిగా కాలిపోయాయి. ఇళ్లలోని సామాన్లు బయటకు తెచ్చుకునే అవకాశం కూడా లేకపోవడంతో 13 కుటుంబాల వారు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ప్రమాద ప్రాంతాన్ని అగ్నిమాపకశాఖాధికారి పార్థసారథి, తహసీల్దార్‌ జి.భీమారావు, తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు, పంచాయతీ కార్యదర్శి విజయరెడ్డి సందర్శించి బాధితులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వచ్చి ఒక్కో బాధిత కుటుంబానికి 10 కిలోల చొప్పున బియ్యం అందజేశారు. తామందరికీ ఈ ప్రాంతంలోనే స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని బాధితులు ఆయనను కోరారు. పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని, అయితే చెరువు గట్టుపై మాత్రం శాశ్వత గృహాల నిర్మాణం చేపట్టవద్దని ఎమ్మెల్యే వారికి సూచించారు.  వైఎస్సార్‌ సీపీ రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్‌ారజు అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, పక్కా గృహాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement