రూ.5 కోట్ల క్రికెట్ బెట్టింగ్ | five crore cricket betting in giddaluru | Sakshi
Sakshi News home page

రూ.5 కోట్ల క్రికెట్ బెట్టింగ్

Published Sat, Apr 2 2016 4:28 AM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

five crore cricket betting in giddaluru

ఎంత పనిచేశావు ‘సిమన్స్’
గిద్దలూరు బెట్టింగ్ రాయుళ్లను ఊడ్చేసిన వెస్టిండీస్ మ్యాచ్
రూ.5 కోట్లకు పైగానే చేతులు మారినట్లు ప్రచారం
గెలుపు భారత్‌దేనంటూ బెట్టింగ్ ఆశలు రేకెత్తించిన క్రికెట్
బెట్టింగ్‌రాయునికి ఓ మాజీ ఎమ్మెల్యే అండదండలు?

 గిద్దలూరు:  భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం రాత్రి జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ గిద్దలూరు బెట్టింగ్‌రాయుళ్ల జీవితాలతో చెలగాటమాడినట్లయింది. భారత క్రికెటర్లు భారీ స్కోరు నెలకొల్పారు. ఇక భారత్‌కు గెలుపు తధ్యమని భావించిన బెట్టింగ్‌రాయుళ్లు ఇష్టారాజ్యంగా బెట్టింగ్‌కు పాల్పడ్డారు. వారితోపాటు ఎన్నడూ బెట్టింగ్ జోలికెళ్లని వారిని కూడా ఈ కూపంలో ఇరుక్కున్నారు. గిద్దలూరు పట్టణంతోపాటు ముండ్లపాడు, కె.ఎస్. పల్లె గ్రామాలు, కొమరోలు, రాచర్ల, కంభం మండలాల్లో సుమారు రూ.5 కోట్లకు పైగానే బెట్టింగ్‌కు జరిగినట్లు సమాచారం.

 బెట్టింగ్‌రాయుళ్ల ఆశలపై నీళ్లు చల్లిన సిమన్స్...
గిద్దలూరు బెట్టింగ్ రాయుళ్ల ఆశలపై వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ సిమన్స్ నీళ్లు చల్లారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 192 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో వెస్టిండీస్ ఓడటం ఖాయమైందంటూ బెట్టింగులు పెద్దమొత్తంలో పెట్టారు. దీనికితోడు భారత్ వరుస మ్యాచ్‌లలో విజయాలను నమోదు చేస్తుండటంతో భారత్ గెలుస్తుందని లక్షల్లో బెట్టింగ్‌కు పాల్పడ్డారు. తక్కువ పరుగుల్లోనే విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గేల్ అవుట్ కావడంతో ఆట మధ్యలోనూ బెట్టింగ్‌కు ఊతం పోసింది. ఇలా బెట్టింగ్ రాయుళ్ల ఆశలకు అవధుల్లేనట్లుగా నగదును ఫణంగా పెట్టారు. చివరకు సిమన్స్, చార్లెస్, రసెల్ వంటి బ్యాట్స్‌మెన్‌లు అద్భుతంగా రాణించడం, భారత్ బౌలర్లు విఫలమవడంతో బెట్టింగ్‌రాయుళ్ల ఆశలు అడియాశలుగా మారాయి. చిరు వ్యాపారులు, చిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు సైతం బెట్టింగ్‌లో నగదు పోగొట్టుకున్న వారిలో ఉన్నట్లు సమాచారం.

 బెట్టింగ్ నిర్వాహకుడిగా ఓ ప్రజాప్రతినిధి?
పట్టణంలో బెట్టింగ్‌కు ఆతిధ్యం వహించింది ఓ ప్రజా ప్రతినిధి అనే విమర్శ గుప్పుమంటోంది. అతనితోపాటు మరో బట్టల వ్యాపారి, బంగారు వ్యాపారి కలిసి బెట్టింగ్ మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వీరు రహస్య ప్రదేశాల్లో ఉంటూ ఫోన్ల ద్వారా బెట్టింగ్ రాయుళ్లను సేకరించి ప్రధాన బెట్టింగ్ కేంద్రానికి దేనికి ఎంత మొత్తంలో అనేది సమాచారమిస్తారు. వీరితో పరిచయాలున్న వారితోనూ, వారికి పరిచయాలున్న వారితో బెట్టింగ్‌లో పాల్గొనేలా చేస్తారు. బెట్టింగ్‌కు పాల్పడే వారు ప్రత్యేక సెల్‌ఫోన్‌లు వాడటంతో ఎవరూ గురుపట్టలేరు. భారత్ పాల్గొనే మ్యాచ్‌లే కాకుండా ఇతర దేశాల మ్యాచ్‌లకు కూడా బెట్టింగ్ సాగుతోంది.  పోలీస్ స్టేషన్‌లో ప్రధాన భూమిక పోషిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు ఖరీదైన సెల్‌ఫోన్లు, నెలసరి మామూళ్లు ముట్టజెబుతున్నారని, దీంతో ఎస్సై, సీఐ, పై స్థాయి అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నారుు.

11 మంది బెట్టింగ్  రాయుళ్లు అరెస్టు
గిద్దలూరు రూరల్:  పట్టణంలోని నరవ రోడ్డులో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 11 మంది యువకులను గురువారం అర్థరాత్రి స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందిన సమాచారం మేరకు కొందరు యువకులు క్రికెట్ క్రీడపై  బెట్టింగులకు పాల్పడుతూ ఘర్షణలకు దిగుతున్నారని తెలియడంతో ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించిన పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి ఐదు వేల రూపాయలను స్వాధీనపరచుకున్నట్లు సిఐ ఫిరోజ్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement