తొలి ఓటరుకు జై!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి గురువారం సాయంత్రం అయిదు గంటలకల్లా ప్రచారపర్వం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) భన్వర్‌లాల్ ప్రకటించారు. నియోజకవర్గంలో ఓటు హక్కు లేని నాయకులందరూ ప్రచార గడువు ముగిశాక అక్కడ ఉండటానికి వీల్లేదని స్పష్టంచేశారు. ప్రచార గడువు ముగిసేలోపే వారంతా జిల్లా దాటి వెళ్లాలని ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో భన్వర్‌లాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, నియోజకవర్గంలో మొత్తం 1,778 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 626 కేంద్రాల నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ జరుగుతుందని, మరో 300 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది లేకుండా టెంట్లు, తాగునీరు, టాయ్‌లెట్లు ఉంటాయని, వికలాంగులకు ట్రై సైకిళ్లు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.
తొలి ఓటరుకు పుష్పగుచ్ఛం
అన్ని పోలింగ్ కేంద్రాల్లో మొట్టమొదటగా ఓటు వేసేందుకు వచ్చే ఓటరుకు ఎన్నికల కమిషన్ ఘనస్వాగతం పలకనుంది. పోలింగ్ అధికారులు, సిబ్బంది వారికి గౌరవంగా పుష్పగుచ్ఛం అందిస్తారని సీఈవో చెప్పారు. 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. గతంలో ఆరు గంటల వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని గంట పాటు కుదించిన విషయాన్ని ఓటర్లు గుర్తించాలని కోరారు.
93.46 శాతం ఓటరు స్లిప్పులు
వరంగల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 15,09,671 మంది ఓటర్లుంటే ఇప్పటివరకు 93.46 శాతం మంది ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. వివిధ కారణాలతో 22,319 మందికి ఓటరు స్లిప్పులు అందలేదన్నారు. ఓటింగ్ రోజున సైతం ఓటరు స్లిప్పులు పొందేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రత్యేక కేంద్రాలుంటాయని, సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారన్నారు. ఫోటో ఓటరు గుర్తింపు కార్డు లేదా ఈసీ గుర్తించిన పది కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డులు, బ్యాంకు లేదా పోస్టాఫీసు పాసు పుస్తకాలు, పాన్ కార్డు, స్మార్ట్ కార్డు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్‌లలో ఏదో ఒకటి చూపిస్తే ఓటుకు అనుమతిస్తారని చెప్పారు.
తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు చెబుతాం
ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలు, మద్యం, నగదు, కానుకల పంపిణీ జరిగితే వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని భన్వర్‌లాల్ సూచించారు. 180042522747 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. లేదా 8790499899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపించాలని కోరారు. ‘ఎంసీసీ’ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి సమాచారం చేరవేస్తే సరిపోతుందని అన్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నామో ఫిర్యాదుదారులకు తెలియజేస్తామని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటివరకు రూ.1.79 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే ‘నోటా’కు ఓటు వేసి ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించవచ్చని తెలిపారు.
ఎస్‌ఎంఎస్‌లు పంపితే క్రిమినల్ కేసులు
ప్రచార గడువు ముగిశాక ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రచారం చేయటం కూడా నిషిద్ధమేనని, దీన్ని ఉల్లంఘించి వాటిని పంపించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఈవో హెచ్చరించారు. బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తే సంబంధిత సర్వీసు ప్రొవైడర్లపైనా కేసులు పెడతామన్నారు. 19వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు విధిగా బంద్ పాటించాలన్నారు. మీడియా సంస్థలు ప్రచార ప్రకటనలు చేయవద్దన్నారు.