శ్రీశైలంలో పుష్ప ప్రదర్శన
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలోని దక్షిణ ద్వారం హరిహరరాయ గోపురం ఎదుట రుద్రాక్షవనంలో ఈఓ నారాయణ భరత్‌గుప్త, జేఈఓ హరినాథ్‌రెడ్డి శనివారం పుష్పప్రదర్శనను ప్రారంభించారు. ఈ నెల 9 వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పలు పుష్పజాతులు, ఔషధ, అలంకార మొక్కలు, పూలతో తయారు చేసిన శివలింగం, నందీశ్వరుడు, చెక్కబండి తదితరవి భక్తులు, పుష్పప్రియులకు ఆకట్టుకుంటున్నాయి. రావి, మేడి, బిల్వం, కదంబం, నాగలింగం, ఉసిరి తదితర పవిత్ర వృక్షాల ప్రయోజనాలు, వాటికి సంబంధించిన పురాణగాథలను తెలియజేసే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఈ శ్రీనివాస్, వివిధ విభాగాధిపతులు, వేదపండితులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.