‘పది’ తప్పిన విద్యార్థులపై దృష్టిసారించాలి
శంషాబాద్ రూరల్: ఇక్కడి పాఠశాలలో ఈసారి ఎంతమంది విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు.. వారంతా సప్లిమెంటరీ పరీక్షలు రాశారా.. వారంతా చదువుకు దూరంకాకుండా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు. మండల పరిధిలోని పాల్మాకుల వద్ద ఉన్న తెలంగాణ మోడల్ స్కూలు ఆవరణలో హరితహారంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలెక్టర్ కాసేపు ముచ్చటించారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఎలాగో పైచదువులకు వెళ్తారు.. ఫెయిలైన వారు.. చదువు కొనసాగించేలా వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టరు సూచించారు. మొక్కల పెంపకంలో విద్యార్థుల పాత్ర కీలకమని తెలిపారు.
పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు, స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలలో ఎన్‌సీసీ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. దీంతో స్పందించిన కలెక్టర్.. ఇక్కడ సర్వే చేరుుంచి బోరు వేయడానికి చర్యలు తీసుకుంటామని, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలోని సమస్యలను తనకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించాలని, ఒక వేళ సమస్యలు పరిష్కారం కాకుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాఠశాలలో కిచెన్ షెడ్, ఫర్నీచర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరిత, ఉపసర్పంచ్ హరీందర్‌గౌడ్, ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, నాయకులు రమేష్, వెంకటేష్‌గౌడ్, సుభాష్, ఉమ్లానాయక్, తదితరులు పాల్గొన్నారు.