సొసైటీల అభివృద్ధిపై దృష్టి పెట్టండి
– ఆడిట్‌ను పకడ్బందీగా చేపట్టాలి.
– సహకార శాఖ ప్రత్యేక కేటగిరి డిప్యూటి రిజిస్ట్రార్ వీరాచారి ఆదేశాలు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలని సహకార శాఖ ప్రత్యేక కేటగిరీ డిప్యూటీ రిజిస్ట్రార్ వీరాచారి ఆదేశించారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా సహకార అధికారులు, సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాల బలోపేతానికి ఐసీడీపీ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సహకార వ్యవస్థ పటిష్టతకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అన్ని సంఘాలు ఎరువుల వ్యాపారం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. పీఏసీఎస్‌లను నిబందనల ప్రకారం ఆడిట్ చేయాలన్నారు. 2015–16 లో జరిగిన లావాదేవీలపై పక్కాగా ఆడిట్ నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు 78 శాతం ఆడిట్ పూర్తయిందని, మిగిలిన 22శాతాన్ని నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి సుబ్బారావు, కర్నూలు డివిజన్ సహకార అధికారి ఉమామహేశ్వరీ, ఆడిట్ అధికారి నాగలింగేశ్వరి, డీసీసీబీ ఓఎస్‌డీ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.