వాసు పాటల బాటలో నడుద్దాం
వాసు పాటల బాటలో నడుద్దాం
Published Mon, Oct 10 2016 12:21 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
– సంస్మరణ సభలో వక్తలు
కర్నూలు (కల్చరల్): ప్రజానాట్య మండలి కవి, గాయకుడు వాసు పాటల బాటలో నడుద్దామని, ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేద్దామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ పిలుపునిచ్చారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం సీపీఎం, ప్రజానాట్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో వాసు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ.. అత్యంత సాదాసీదా జీవనం గడిపిన వాసు నిరంతరం శ్రమ జీవుల కష్టాలను అక్షరీకరించేందుకు కృషి చేశాడన్నారు. ఆయన రాసిన పాటలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయన్నారు. వాసు రాసిన ప్రతిపాట నిరుపేదల బతుకు చిత్రాన్ని తెలుపుతోందని ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్ అన్నారు. ఆయన కుటుంబానికి ప్రజానాట్యమండలి బాసటగా నిలుస్తుందన్నారు. రవీంద్ర విద్యాసంస్థ డైరెక్టర్ పుల్లయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చిన్న వయస్సుల్లోనే తనువు చాలించడం అత్యంత విషాదకరమన్నారు. పాట కోసం ఆయన పడిన తపన మరువలేనిదన్నారు. కళాకారులందరికీ వాసును ఆదర్శప్రాయుడని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు షడ్రక్, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య కొనియాడారు. వాసు కుటుంబానికి పలువురు ఆర్థిక సాయం అందించారు.
వాసుకు స్వర నీరాజనం..
వాసు రాసిన గీతాలను పాడి నీరాజనం అర్పించారు. కథా రచయిత ఇనాయతుల్లా కవిత ద్వారా, గజల్ గాయకుడు మహమ్మద్‌మియా గజల్ ద్వారా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, చేతివృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శేషయ్య, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్‌బాబు, వాసు సోదరుడు అన్నయ్య, ప్రజానాట్య మండలి కళాకారులు నాగరాజు, జిల్లా అధ్యక్షులు బసవరాజు, వాసు సతీమణి సుజాత తదితరులు పాల్గొన్నారు.
Advertisement