కాఫీపొడిలో రంగు...రవ్వలో రంపపు పొట్టు
మంగళగిరి(గుంటూరు): మంగళగిరి పట్టణంలో ఆహార కల్తీ నియంత్రణ అధికారులు శుక్రవారం విస్తతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఆహార కల్తీ నియంత్రణ అధికారి జి. పూర్ణ చంద్రరావు ఆధ్వర్యంలో ఉదయం పదకొండు గంటలనుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. మెయిన్‌బజార్‌లోని చిల్లరకొట్లు, జనరల్ స్టోర్స్‌తో ప్రారంభించి పలు సెంటర్లలోని స్వీట్ షాపులు, హోటళ్లు, దాబాలు, కాఫీ షాప్‌లలో విస్తతంగా సోదాలు నిర్వహించారు. ఆటోనగర్ దాబా హోటల్‌తో పాటు మంగళగిరి విజయవాడ రోడ్‌లో తాడేపల్లి వరకు పలు హోటళ్లలో ఈ తనిఖీలు జరిగాయి. అనంతరం పూర్ణచంద్రరావు విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. పలు దుకాణాలలో గుట్కా, మాణిక్‌చంద్, పాన్‌పరాగ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశామన్నారు. తినుబండారాల ప్యాకెట్లు నిల్వ వున్నవి విక్రయించడాన్ని గమనించామని ఆయా దుకాణాలలో ప్యాకెట్లును స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశామన్నారు.
నిత్యావసర వస్తువులు సైతం కల్తీ జరిగినట్లు గుర్తించామన్నారు. పిండి,రవ్వ పదార్థాలలో కొందరు దుకాణదారులు రంపపుపొడి కలపడంతో పాటు కాఫీ పొడిలో రంగు కలుపుతున్నట్లు గుర్తించి ఆయా దుకాణదారులకు నోటీసులు జారీ చేశామన్నారు. ఇక స్వీట్ దుకాణాలు, హోటళ్లలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉన్నట్టు గుర్తించామని, అదే విధంగా దాబా సెంటర్లలో నిల్వ వున్న కూరలు, లస్సీలతో పాటు పలుపదార్థాల తయారీకి వాడుతున్న నూనెలో కల్తీ జరుగుతోందని, ఆయా యజమానులందరికీ నోటీసులు జారీచేస్తున్నామన్నారు. కర్రీస్ పాయింట్‌లలో కల్తీ నూనె వినియోగిస్తున్నారని తెలిపారు. ఇక నుంచి నిరంతరం పర్యవేక్షించి కేసులు నమోదు చేయడంతో పాటు హోటళ్లను సీజ్ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఫుడ్‌కంట్రోలర్ వెంకటేశ్వరావుతో పాటు పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతీవస్తువూ కల్తీనే...
మంగళగిరిలో అధికారుల తనిఖీలలో వెలుగు చూసిన వాస్తవాలను చూసి పట్టణవాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్నపిల్లలు తినే చెకోడీలు, చాక్లెట్లుతో పాటు కాఫీ పొyì లో రంగుపొడి, రవ్వలో రంపపుపొట్టు, హోటళ్లలోని బిర్యాని రైస్‌లో సేమ్యా ఇలా ఏ నిత్యావసర వస్తువు చూసినా కల్తీమయమై ఉండడం పలువురిని ఆందోళనకు గురిచేసింది.S మిఠాయి దుకాణాలతో పాటు తయారు చేసే కేంద్రాలను చూసిన అధికారులు సదరు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిఠాయిలలో రంగులు ఎక్కువ వాడటంతో పాటు నెలల తరబడి నూనెను బాండిళ్లలో వుంచి తయారు చేయడం వలన అవితినే వారు అనారోగ్యం బారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీనూనెలతో కర్రీస్ అమ్మే పాయింట్స్, నిల్వ ఉన్న పదార్థాలతో నిర్వహిస్తున్న హోటళ్లను చూసి బాబోయ్ ఇవేనా మనం తినేది అంటూ జనం బెంబేలెత్తారు.
కొందరికి ముందే సమాచారం..
15 మంది అధికారులు బందాలుగా ఏర్పడి పట్టణంలో తనిఖీలు నిర్వహించగా ప్రధాన హోటళ్లు, దాబాలకు ముందే సమాచారం అందడం పలు అనుమానాలకు తావిస్తోంది. పలు హోటళ్ళు, దాబాలు,మిఠాయి దుకాణదారులు వారు వాడే నూనె డబ్బాలను, పలు వస్తువులను వేరేచోటకు తరలించడం గమనార్హం.