స్వలాభం కోసం బడిని కూల్చేస్తునారు
స్వలాభం కోసం బడిని కూల్చేస్తునారు
Published Thu, Jul 21 2016 10:58 PM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM
ఎమ్మెల్యే జోగేశ్వరరావు తీరుపై లీలాకృష్ణ, పాపారాయుడు ధ్వజం
మండపేట :
మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తన స్వప్రయోజనాల కోసం పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కూల్చేయించారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు ధ్వజమెత్తారు. æఎమ్మెల్యే తన కార్యాలయానికి మార్గం కోసం సమీపంలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ భవనాన్ని తొలగిస్తున్నారని వారన్నారు. తొల గిస్తున పాఠశాల భవనాన్ని లీలాకృష్ణ ఆధ్వర్యంలోని పార్టీ నాయకులు గురువారం సందర్శించారు. వారు పాఠశాలకు చేరుకోగానే విద్యార్థుల తల్లిదండ్రులు, వ్యాపారులు, పూర్వ విద్యార్థులు అక్కడకు వచ్చి తమ గోడు విన్నవించుకున్నారు. పాఠశాలను పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ తరఫున తాము పోరాడతామని లీలాకృష్ణ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాఠశాల తొలగింపుతో ఈ భవనం కింది భాగంలో వ్యాపారాలు చేసుకుంటున్న 10 షాపుల వారూ వీధిన పడ్డారన్నాని తెలిపారు. సుమారు 400 మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారన్నారు. స్కూల్ భవనాన్ని కూల్చడానికి ఎమ్మెల్యే మున్సిపల్ కౌన్సిల్లో తన పలుకుబడిని ఉపయోగించి తీర్మానం చేయించారన్నారు. పాఠశాలను పునరుద్ధరించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని లీలాకృష్ణ, పాపారాయుడు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దేవు శివానందరావు, దూలం వెంకన్నబాబు, గంగుమళ్ల రాంబాబు, మేడపాటి సురేష్‌రెడ్డి, మేడపాటి బసివిరెడ్డి, పడాల మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement