విదేశీ రాజధానే..
స్విస్ చాలెంజ్ పద్ధతిని రద్దు చేయాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
విజయవాడ(గాంధీనగర్) : ప్రజారాజధాని నిర్మాణం చేపడతామని చెప్పిన సీఎం చంద్రబాబు చివరికి అమరావతిని ప్రైవేటు, కార్పొరేట్, విదేశీ రాజధానిగా మార్చేశారని పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు విమర్శించాయి. హనుమంతరాయ గ్రంథాలయంలో ‘ రాజధాని- విదేశీ కంపెనీలు- స్విస్ చాలెంజ్ ’ అనే అంశంపై రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి వడ్డేశోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని నెహ్రూ, సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి.మధు, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. సీపీఎం రాజధాని ప్రాంత కమిటీ కన్వీనర్ సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ చీకటి ఒప్పందాల్లో భాగంగానే స్విస్‌చాలెంజ్ పేరుతో సింగపూర్ కన్సార్టియంకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నారన్నారు. ఉచితంగా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నారంటూ చెప్పిన చంద్రబాబు కోట్లాది రూపాయలు, వం దలాది ఎకరాల భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టారన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ ఐదేళ్ల కాలపరిమితితో వచ్చిన చంద్రబాబు అహం కార పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేల్కర్ కమిటీ వద్దని చెప్పిన స్విస్‌చాలెంజ్ విధానంలో నిర్మాణ చేపడితే ప్రజాస్వామ్యానికి, రైతులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సత్తా జిల్లా నాయకుడు భానుప్రసాద్ మాట్లాడుతూ దేశప్రజలను అవమానించే రీతిలో చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కేఎల్ రావు ఈ దేశంలో పుట్టిన గొప్ప ఇంజినీర్లు అన్న విషయం చంద్రబాబు మర్చిపోయారన్నారు. ఎంసీపీఐ రాష్ర్ట నాయకుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి నష్టదాయకమైన విధానాలు అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని ప్రాంత రైతు అనుమోలు గాంధీ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో దొంగతనంగా సామాజిక ప్రభావాన్ని అంచనా సర్వే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో 80 శాతానికి పైగా వరద ముంపునకు గురవుతుందన్నారు. కొండవీటి వాగును లిప్ట్ చేస్తామనడం అసంబద్దమన్నారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకుడు హరినాథ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్, సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, ఉండవల్లి రైతు శివకుమార్, కొలనుకొండ శివాజీ, పోతిన వెంకటరామారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పోలారి ప్రసాద్ ప్రసంగించారు.