ఏపీలో విదేశీ విశ్వవిద్యాలయ కేంద్రాలు | foreign university centers in Andhra | Sakshi
Sakshi News home page

ఏపీలో విదేశీ విశ్వవిద్యాలయ కేంద్రాలు

Published Fri, Aug 12 2016 5:17 PM | Last Updated on Wed, Jul 10 2019 2:44 PM

ఏపీలో విదేశీ విశ్వవిద్యాలయ కేంద్రాలు - Sakshi

ఏపీలో విదేశీ విశ్వవిద్యాలయ కేంద్రాలు

ఏయూ క్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్వీడన్‌లోని బ్లికింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(బీటీహెచ్‌)తో దశాబ్దకాలం సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించడం శుభ పరిణామమని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య ఎల్‌.వేణుగోపాల రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ సెనేట్‌ మందిరంలో నిర్వహించిన దశాబ్ది అనుబంధ ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ తాను ఉపకులపతిగా ఉన్న సమయంలో ఈ ఎంఓయూకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ విద్యకు దశాబ్ధం క్రితమే ఏయూ నాంది పలికిందన్నారు. త్వరలో విదేశీ విద్యా సంస్థలు రాష్ట్రంలో తమ శాఖలను స్థాపించే అవకాశం ఉందన్నారు. తద్వారా విద్యార్థులు స్థానికంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని చెప్పారు.
 
ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ నాణ్యమైన ఉన్నవిద్యను అందించే క్రమంలో ప్రపంచంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేస్తామన్నారు. భవిష్యత్తులో సైతం సంయుక్త పరిశోధనలు, ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహించాలని సూచించారు. 

బీటీహెచ్‌ స్వీడన్, వైస్‌చాన్సలర్‌ ఏండర్స్‌ హిడిస్టిర్న మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ నైపుణ్యాలను వద్ధిచేసి, స్వీయ సంపత్తి సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.  ఆవిష్కరణల ప్రాతిపదికగా సమాజం అభివద్ధి చెందుతోందన్నారు. రానున్న దశాబ్ధ కాలంలో మరిన్ని నూతన కోర్సులు, కార్యక్రమాల నిర్వహణ దిశగా నడుస్తామన్నారు. ఇంజినీరింగ్‌ నిపుణులను తీర్చిదిద్ది మానవ వనరుల కొరతను తీర్చనున్నట్లు తెలిపారు.
 
బీటీహెచ ఇండియా ఇనీషియేటివ్స్‌ డైరెక్టర్‌ గురుదత్‌ వేల్పుల మాట్లాడుతూ డబుల్‌ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్‌ ఆచార్య ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఆచార్య బి.మోహన వెంకట రామ్‌ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆచార్య వేణుగోపాల రెడ్డి, ఆండ్రస్‌లను ఏయూ వీసీ నాగేశ్వరరావు సత్కరించారు.

కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య పి.విజయప్రకాష్, ప్రిన్సిపాల్స్‌ ఆచార్య సి.వి రామన్, కె.గీయత్రీ దేవి, డి.గౌరీ శంకర్, సి.హెచ్‌ రత్నం, ఇంజనీరింగ్‌ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఆచార్య పేరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement